సినిమా ఎలా తీయాలో తెలుసు: బాలకృష్ణ
విజయవాడ: తన నియోజకవర్గంలో టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పార్టీలో విభేదాలు సర్వసాధారణమని, చిన్న సమస్యలు ఏవైనా ఉంటే త్వరలో సర్దుకుంటాయని చెప్పారు. ఇకపై సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు.
తన అల్లుడు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తు పార్టీ నిర్ణయిస్తుందన్నారు. లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకుంటారా, లేదా అనేది సీఎం చంద్రబాబు ఇష్టమని అన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తీసే సినిమాలో తానే హీరోగా నటిస్తానని తెలిపారు. సినిమా ఎలా తీయాలో, ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని బాలకృష్ణ అన్నారు. కాగా, హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష‍్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ‍్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.