చదువుకోవాలనుంది... సార్ ! | i want to go to school girl appeals Medhak collector | Sakshi
Sakshi News home page

చదువుకోవాలనుంది... సార్ !

Published Mon, Apr 24 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

చదువుకోవాలనుంది... సార్ !

చదువుకోవాలనుంది... సార్ !

మెదక్‌ ‌: కన్నతల్లి చనిపోయింది. తండ్రి ఉన్నా పట్టించుకోవడం లేదు.. ఉన్నత చదువులు చదవాలనుంది. ఆదుకోండమ్మా! అంటూ కలెక్టర్‌ భారతి హొళికేరిని ప్రజావాణిలో పన్నెండేళ్ల ఓ చిన్నారి వేడుకుంది. రైల్వేలైన్‌ ఏర్పాటులో తమ వ్యవసాయ భూములు కోల్పోయామని, న్యాయం చేయండంటూ అవుసులపల్లికి చెందిన పలువురు రైతులు మొర పెట్టుకున్నారు. ఒకచేయి లేకపోవడంతో ఏ పనీ చేయలేక బతుకు భారమవుతోందని, పింఛన్‌ ఇప్పించాలని కంచన్‌పల్లికి చెందిన లలిత అనే మహిళ వేడుకుంది. సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 138 దరఖాస్తులు వచ్చాయి.

కన్నతల్లి లేదు...తండ్రి ఉన్నా పట్టించుకుంట లేడు:
కన్నతల్లి చనిపోయింది.. తండ్రి ఉన్నా పట్టించుకుంటలేడు.. ఉన్నత చదువులు చదవాలని ఉంది. అవకాశం కల్పించి ఆదుకోండమ్మా! అంటూ హవేళిఘనాపూర్‌ మండలం బ్యాతోల్‌ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నిరీక్షణ అనే పన్నెండేళ్ల బాలిక వేడుకుంది. బ్యాతోల్‌ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నాగమణి, శ్రీనివాస్‌ దంపతుల కూతురు నిరీక్షణ మెదక్‌ పట్టణంలోని వెస్లి పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తల్లి నాగమణి చనిపోవడంతో తండ్రి శ్రీనివాస్‌ తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. నాకు బాగా చదవాలనుంది.. అవకాశం కల్పించి ఆదుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరిని వేడుకుంది. స్పందించిన కలెక్టర్‌ బాలికను కేజీబీవీలో చేర్పించి భవిష్యత్‌ కల్పించాలని అధికారులను ఆదేశించారు.

తల్లిదండ్రులు లేని పిల్లలు.. ఆదుకోండమ్మా!
తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా తయారైందని, వారిని ఆదుకోవాలని మెదక్‌ మండలం మక్తభూపతిపూర్‌ గ్రామానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. నా కొడుకు, కోడలు ఆర్నేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి సంతానమైన ముగ్గురు పిల్లలు కృష్ణ, జ్యోతి, చింటుల పోషణ నాపై పడిందని వాపోయింది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు చనిపోగా, కాటికి కాలు చాపిన వయస్సులో ఉన్న నా కాలు విరిగి నడవలేని స్థితిలో బతుకే భారంగా మారి దుర్భరమైన బతుకు బతుకుతున్నామని వాపోయింది. ఈ వయస్సులో వారిని పోషించలేక పడరాని పాట్లు పడుతున్నానని, వారికి దారిచూపి ఆదుకోవాలని వేడుకుంది. స్పందించిన కలెక్టర్‌ చిన్నారులను హాస్టళ్లలో చేర్పించి భవిష్యత్‌ కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రైల్వేలైన్‌లో భూములు కోల్పోయాం..న్యాయం చేయండి
రైల్వేలైన్‌ ఏర్పాటులో మా వ్యవసాయ భూములు కోల్పోయాం. పరిహారం చెల్లించి ఆదుకోవాలని మెదక్‌ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. అక్కన్నపేట–మెదక్‌ రైల్వేలైన్‌ ఏర్పాటుకు కావాల్సిన భూమిని తాము ఇచ్చినదానికంటే ఎక్కువ భూమిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అధికారులు ఎలాంటి సర్వే చేయకుండానే రైల్వేలైన్‌ పనులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము బతుకుదెరువు కోల్పోవాల్సి వస్తోందని, అదనంగా కోల్పోయిన భూమికి సంబంధించి పరిహారం అందించి ఆదుకోవాలని అవుసులపల్లి గ్రామానికి చెందిన నరేష్, యాదయ్య, మల్లయ్య, లక్ష్మి, సత్యనారాయణ, సత్తయ్య, లక్ష్మి, గొండయ్య తదితరులు వేడుకున్నారు.

వంట చేస్తూ చేయి కోల్పోయా... పింఛన్‌ ఇప్పించి ఆదుకోండి
ఇంట్లో వంట చేస్తుండగా పిట్స్‌ రావడంతో చేయి పొయ్యిలో పడి కాలిపోయిందని, దీంతో ఒంటి చేతి బతుకు భారంగా మారిందని, పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత కలెక్టర్‌ను కోరింది. సదరన్‌ క్యాంపులో దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారిని పిలిచి మందలించి సదరన్‌ క్యాంపులో దరఖాస్తు చేసుకున్న వారికి వెంట వెంటనే అర్హత సర్టిఫికెట్‌ అందజేయాలని, ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాధితురాలైన లలితకు సర్టిఫికెట్‌ ఇప్పించి న్యాయం చేయాలని ఆదేశించారు.

సర్దన స్కీంను ప్రారంభించి తాగునీటి సమస్య తీర్చండి
ఆర్‌డబ్ల్యూఎస్‌ సర్దన స్కీంను ప్రారంభించి 38 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు మల్లేశం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. హవేళిఘణాపూర్‌ మండలంలోని 38 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సర్దన పథకం ప్రారంభించి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. 2016లో పథకం మోటార్‌ చెడిపోయిందన్న సాకుతో పథకాన్ని నిలిపివేశారన్నారు. దీంతో పథకంలో పనిచేస్తున్న 17మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గ్రామాల్లో నీటి సమస్య అధికమైందని వాపోయారు.
► పుట్టుకతో మూగ, మానసిక వికలాంగురాలైన తమ కూతురు రేణుకకు పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని మెదక్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన హేమలత, శ్రీనివాస్‌లు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు.
► ప్రమాదంలో కాలు విరిగి బతుకు భారంగా మారింది.. ఉపాధి కల్పించి ఆదుకోవాలని పాపన్నపేట మండలం గాంధారిపల్లికి చెందిన బేగరి రాజు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. 2015సెప్టెంబర్‌లో ఆటో బోల్తాపడగా కాలు విరిగిందని, దీంతో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు.
► డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ హవేళిఘణాపూర్‌ మండలం ఔరంగాబాద్‌ తండాకు చెందిన పలువురు గిరిజనులు ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. అలాగే మెదక్‌ మండలం ఖాజిపల్లికి చెందిన లస్మవ్వ అనే వృద్ధురాలు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకుంది.

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టండి
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బ్రోకరిజాన్ని అరికట్టాలని తెలంగాణ అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యాలయంలో అధికారులు సామాన్య ప్రజలకంటే బ్రోకర్ల ద్వారా వచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement