సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’కి ఎవరైనా రావొచ్చని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ స్పష్టం చేశారు. ప్రజావాణికి జర్నలిస్టులకు అనుమతి లేదంటూ సమావేశ మందిరం నుంచి బయటికి పంపించిన జాయింట్ కలెక్టర్ రవి తీరును మంగళవారం పాత్రికేయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. జర్నలిస్టుల ప్రవేశం, కవరేజ్‌పై ఎలాంటి ఆకాంక్షలు లేవని వెల్లడించారు.
ప్రజావాణికి అందరూ హాజరు కావచ్చని, సమావేశ మందిరంలో ఉండవచ్చన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానం కానీ, రావద్దన్న ఆంక్షలు గానీ లేవన్నారు. సమావేశ మందిరంలో అధికారుల మాదిరిగా మీడియాకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు లేకున్నా.. ఖాళీగా ఉన్న సీట్లలో అధికారులకు ఇబ్బంది కలుగకుండా జర్నలిస్టులు కూర్చోవచ్చన్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రజావాణి సమావేశ మందిరం నుంచి జర్నలిస్టులను బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, దానికి గల కారణాలపై విచారణ చేస్తానన్నారు. జాయింట్ కలెక్టర్ రవి నుంచి వివరాలు తెలుసుకుంటానని కలెక్టర్ మాణిక్ రాజ్‌తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment