పేటేరు ప్రమాదంలో దుర్మరణం చెందిన వ్యక్తి (ఫైల్)
నిర్లక్ష్యం వహిస్తే.. బూమ్‌మ్!!
Published Mon, Sep 26 2016 7:52 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
* రేపల్లె మండలంలోని పేటేరు, ఇసుకపల్లిలో అక్రమ బాణసంచా స్థావరాలు?
* గతేడాదిలో పేటేరులో భారీ పేలుడు
* వ్యక్తి మృతి, 1992లో మరో ఘటన
* మరోఘటన సంభవించే అవకాశం?
రేపల్లె: దీపావళి పండుగ వస్తుందంటే తీర ప్రాంతలో ఏ ప్రాంతంలో ఎలాంటి ఘటన జరుగుతుందోనని ప్రజానీకం భయాందోళనకు గురవుతుంది.. సరిగ్గా ఏడాది క్రితం పేటేరులో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు ఈ శనివారానికి ఏడాది పూర్తయ్యింది. గత సంవత్సరం పేటేరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో అనధికారికంగా మందుగుండు సామగ్రిని గచ్చుకింద గొయ్యితీసి దాచిపెట్టాడు. దీపావళి సందర్భంగా వేరోచోటికి తరలించేందుకు యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విస్ఫోటనం జరిగి ఓ వ్యక్తి ఇంటి పైకప్పుకు బలంగా కొట్టుకొని కిందపడ్డాడు. ప్రమాదంలో ఆ వ్యక్తి తునాతునకలై దుర్మరణం చెందాడు. ఆ దెబ్బకు ఇంటి వాసాలు, పెంకులూ ధ్వంసమయ్యాయి. ప్రమాదం సంభవించిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్ ప్రారంభమైంది. అక్రమంగా మందుగుండు సామగ్రి తయారీపై స్థానికంగా భయాందోళనలు వ్యాపిస్తున్నాయి.
1992లో ఓల్డ్‌టౌన్‌లో భారీ పేలుడు..
1992లో పట్టణంలోని ఓల్డ్‌టౌన్‌లో బాణాసంచా తయారు చేస్తున్న ఓ స్థానవరంలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొన్నాళ్ల తర్వాత ఓ మహిళ ఇంట్లో కొన్నిరకాల మందుగుండు సామగ్రిని నూరుతుండగా మరో ప్రమాదం చోటు చేసుకుంది.
పేటేరు తాటాకు టపాసులకు ప్రసిద్ధి..
దీపావళి పండుగ వినగానే తీరప్రాంతంలోని ప్రజలకు గుర్తుకు వచ్చేది తాటాకు టపాసులు, తారాజువ్వలు. జిల్లాలోనే తాటాకు టపాకాయలు, తారాజువ్వల తయారీకి మండలంలోని పేటేరు, ఇసుకపల్లి ప్రసిద్ధి చెందినవని ప్రజలకు తెలిసిన విషయమే. పండుగ సందర్భాలలో ఈ ప్రాంతాల్లో లైసెన్స్‌లు లేకుండానే ఏటా టపాసుల తయారీ జరుగుతుంది. గతంలో ప్రమదాలు సంభవించిన ఘటనలూ ఎన్నో ఉన్నా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడమే తప్ప పెద్దగా ప్రభావం చూపేంతా చర్యలు ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. మండలంలో దీపావళి మందుగుండు సామగ్రి అక్రమ తయారీని, విక్రయాలను నివారించితేనే మరో ప్రమాదం సంభవించుకుండా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.
Advertisement