
జలీల్‌కు దేహశుద్ధి తప్పదు
సీపీఐ, సీపీఎం నేతల హెచ్చరిక
గొల్లపాలెంగట్టు (వించిపేట) : కొండ ప్రాంత ప్రజల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎమ్మెల్యేకు ప్రజలే దేహశుద్ధి చేస్తారని సీపీఐ, సీపీఎం నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. నగర వ్యాప్త ఉద్యమంలో భాగంగా సీపీఐ, సీపీఎం నగర కమిటీల అధ్వర్యంలో మంగళవారం గొల్లపాలెంగట్టు నుంచి నైజాంగేటు మీదుగా ప్రైజర్‌పేట వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయత్రలో పాల్గొన్న సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నగరంలోని కొండ నివాసితులకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కల్పిస్తామని, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ విషయాన్ని మరచి భూములను కొల్లగొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఒక పార్టీ గుర్తుపై గెలిచి ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా తన స్వలాభం కోసం అధికార పార్టీలో చేరి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేశారన్నారు.
మంత్రి పదవుల కోసం పార్టీలు మారేవారు ముందు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని పేర్కొన్నారు. సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని నమ్మి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మోసగించి తన ఆస్తులను పెంచుకునేందుకు అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. ముంపు ప్రాంతమైన వన్‌టౌన్‌లో ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడాజరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై దృష్టిసారించకపోతే ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ నెల 22న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి కట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మి, బోయి సత్యబాబు, కొండారెడ్డి, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, తాడి పైడియ్య, దేవుడమ్మ పాల్గొన్నారు.