లక్ష్యాలు సాధించకుంటే చర్యలు!
డ్వామా సిబ్బందికి కలెక్టర్ హెచ్చరిక
గుంటూరు వెస్ట్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, లేకుంటే విధుల నుంచి తొలగించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే డ్వామా సిబ్బందిని హెచ్చరించారు. పనితీరు మెరుగుపర్చుకుని ప్రజల అభివృద్ధిని కాంక్షించేలా విధులు నిర్వహించాలని ఎంపీడీవోలకు సూచించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులు, నీటికుంటలు, ఇంకుడు గుంతలు, వర్మీ కంపోస్టు యూనిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్టీఆర్ జలసిరి, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, సామాజిక మొక్కల పెంపకం తదితర అంశాలపై జిల్లాపరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. పల్నాడు ప్రాంతంలోని అనేక మండలాలు ఉపాధి హామీ పనులు చేపట్టడంలో వెనుకబడి ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని వాటిని సాధించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో చుండూరు మండలం వెనుకబడి ఉండటానికి కారణమైన ఏవో వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ పులి శ్రీనివాసులును కలెక్టర్ ఆదేశించారు. వర్మీకంపోస్టు యూనిట్లు రానున్న 15 రోజుల్లో మండలానికి కనీసం 150 చొప్పున పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య, డీపీవో కె.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు తక్షణం నగదు జమ చేయాలి..
జిల్లా పరిషత్ ద్వారా సుమారు రూ.75 లక్షలు ఎస్సీ కార్పొరేషన్‌కు జమ కావాల్సి ఉందని, అందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ వెంకటసుబ్బయ్యను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని సంక్షేమ భవన్‌లో జరిగిన ఎస్సీ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డు సభ్యులైన ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ ద్వారా మంజూరైన వివిధ పథకాలు, లబ్ధిదారుల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి రుణాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.