ఎన్నికల ఖర్చుకు అదనంగా..రూ.10 కోట్లిస్తారట.. | In addition to the election expenditure of Rs 10 crores | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఖర్చుకు అదనంగా..రూ.10 కోట్లిస్తారట..

Published Mon, Mar 14 2016 3:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

ఎన్నికల ఖర్చుకు అదనంగా..రూ.10 కోట్లిస్తారట.. - Sakshi

ఎన్నికల ఖర్చుకు అదనంగా..రూ.10 కోట్లిస్తారట..

అధికార పార్టీ ప్రలోభాల పర్వాన్ని బయటపెట్టిన
పూతలపట్టు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్

 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు అడ్డదారిలో అధికార టీడీపీ చేస్తున్న యత్నాలను వైఎస్సార్ సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ బయటపెట్టారు. టీడీపీలో చేరాలంటూ తనను ప్రలోభపెట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని, నెలరోజులుగా వివిధ నంబర్ల నుంచి ఫోన్లు చేసి బేరసారాలు సాగిస్తున్నారని, గత ఎన్నికల్లో చేసిన ఖర్చు కాకుండా.. అదనంగా మరో రూ.పదికోట్లు ఇస్తామని చెబుతున్నారని ఆయన వెల్లడించారు.ఆయన ఆదివా రం చిత్తూరు జిల్లా ఐరాలలో విలేకరులతో మాట్లాడారు.చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు ఫోన్లు చేస్తూ తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

‘‘మేం ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి.. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. కొత్తగా ఎన్నికయ్యారు.. డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీరు అనుకుంటున్న పనులు ఏవీ జరగట్లేదు. మరోలా అనుకోకుంటే మీరు గత ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తానికి అదనంగా మరో రూ.10 కోట్లు ఇస్తాం. ఎన్నికల్లో మీకు రూ.20 కోట్లు వరకు ఖర్చయి ఉంటుంది కదా! మీది బాబుగారి సొంత జిల్లా. మంచి భవిష్యత్తు, కెరీర్ ఉంటుంది. అన్నీ ఆయనే చూసుకుంటారు.  డీలిమిటేషన్ జరుగుతుంది.. మీకు ఎమ్మెల్యే సీటు తప్పక ఇస్తాం.. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు.. జిల్లాలో ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు.. ముందు వచ్చిన వారికే ప్రయారిటీ ఉంటుంది.. వెంటనే వచ్చేయండి’’ అంటూ ఫోన్లలో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఒక నంబరునుంచి.. ఇంకోసారి ఇంకో నంబరునుంచి ఫోన్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. తనకు ఫోన్లు చేయొద్దని చెప్పినా.. ఇలా సిగ్గులేకుండా ఫోన్లు చేయడం తగునా? అని ప్రశ్నించారు.
 
 వైఎస్సార్‌సీపీని వీడను..
 ‘‘నేను జగన్‌మోహన్‌రెడ్డి దయవల్లే ఎమ్మెల్యేనయ్యా. డాక్టరుగా ఉన్న నన్ను రాజకీయాలకు కొత్తయినా.. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆదరించారు. జిల్లా నాయకత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలువైన సూచనలు సలహాలిచ్చి నా విజయానికి ఎంతగానో తోడ్పాడ్డారు. వీరిద్దరే నాకు రాజకీయ గురువులు. రాజకీయాల్లో ఉన్నంతవరకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను’’ అని సునీల్‌కుమార్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement