జిల్లాలో 43 మినీ రైతు బజార్లు
చింతలపూడి: రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 43 మండలాల్లో 43 మినీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజారును గురువారం ఆమె ప్రారంభించారు. జిల్లాలో ఆరు రైతు బజార్లలో మినహా మిగిలిన వాటిని శీతల గిడ్డంగులతో ప్రారంభిస్తున్నామన్నారు. చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొయ్యలగూడెం, నల్లజర్ల, మండలాల్లో రైతు బజార్ల కోసం ప్రభుత్వం రూ.47 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు.
ఏలూరులో ఈ–మార్కెట్ విధానం
రాష్ట్రంలోని పది మార్కెట్ కమిటీల్లో ఈ–మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీనిలో భాగంగా ఏలూరు మార్కెట్ యార్డులో నిమ్మకాయల అమ్మకానికి ఈ–మార్కెట్ విధానం ప్రవేశపెట్టామని చెప్పారు. చింతలపూడిలో శీతల గిడ్డంగిని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి రైతు బజారుగా అభివద్ధి చేస్తామన్నారు. శుక్రవారం ప్రారంభించనున్న కోటి మొక్కల ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల 5వ తేదీ నుంచి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. రూ.10 కోట్లతో గుంటుపల్లి, కామవరపుకోట రహదారిని అభివద్ధి పరుస్తున్నామన్నారు. మార్కెటింగ్ శాఖ ఏడీ పి.ఛాయాదేవి,ఎంపీపీ దాసరి రామక్క, ఉద్యాన శాఖ ఏడీ దుర్గేష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి టీటీవీఎస్‌ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ‘చింతలపూడి’ రైతులు
చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి వచ్చిన ఆమె ఎత్తిపోతల పథకం రైతులను కలిశారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించకుండా కాలువ పనులు చేపడుతుందని రైతులు ఆమె దష్టికి తీసుకువచ్చారు.