- కనగానపల్లిలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయండి
- కలెక్టర్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలు
అనంతపురం అర్బన్ : కనగానపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవికి బుధవారం ఎన్నిక జరుగనుందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్ కోన శశిధర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి, సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాగే పరశురాం కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆ ప్రాంతం చాలా సమస్యాత్మకమైందని తెలిపారు. కాబట్టి ప్రస్తుతం జరగనున్న ఎన్నికలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా చూడాలన్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మండల పరిషత్‌లో సంపూర్ణ ఆధిక్యత ఉందని, తమ పార్టీ అభ్యర్థి మండల పరిషత్ అధ్యక్షనిగా ఎన్నిక అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ ఎన్నికను ఏకపక్షంగా జరుపుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మండల పరిషత్ సభ్యులకు తగిన రక్షణ కల్పించి ప్రజాస్వామ్య పద్ధతిలోఎన్నిక జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.