అక్రమార్కుల్లో దడదడ
ఠారెత్తిస్తోన్న ఇన్‌కంట్యాక్స్ దాడులు
పన్ను ఎగవేతదారులపై ఐటీ కన్ను
జిల్లా వ్యాప్తంగా బంగారం, కార్ల కొనుగోళ్లపై ఆరా
చిత్తూరు, తిరుపతిల్లో మొదలైన ఐటీ వేట
జిల్లాలో ఐటీ వేట మొదలైంది. పన్ను చెల్లించకుండా నల్ల«ధనాన్ని వెనకేసుకున్న అక్రమార్కులను బయటకు లాగే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. ఇందుకోసం మొదట చిత్తూరు, తిరుపతి పట్టణాలను ఎంపిక చేసుకున్నారు. అనుమానమున్న నల్లకుబేరుల చిట్టాలను తిరగేస్తున్నారు. ఓ నిర్ధారణకు వచ్చాక అకస్మాత్తుగా దాడులకు పూనుకుటున్నారు. దీంతో ప్రస్తుతం సంపన్నులుగా చలామణి అవుతున్న బడా బాబుల్లో ఐటీ భయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
తిరుపతి : అక్రమార్కుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కోట్ల విలువ చేసే నగదు, డాక్యుమెంట్లను మూడో కంటికి తెలియకుండా దాచే పనుల్లో నిమగ్నమయ్యారు. వరుసగా జరుగుతున్న ఐటీ సోదాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమార్కుల్లో ఐటీ జ్వరం తీవ్రస్థాయికి చేరుతోంది. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా నల్లధనాన్ని వెనకేసుకున్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇన్‌కంట్యాక్స్ పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల చిత్తూరులో బద్రీనారాయణ ఇంట్లోనూ, పలమనేరు మండలంలోనూ ఐటీ సోదాలు జరిగాయి. తాజాగా రెండ్రోజు ల నుంచి తిరుపతి పట్టణంలోని గుణశేఖర్‌యాదవ్ ఇంట్లోనూ, వరరూప హ్యాపీ హోమ్స్ సంస్థల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీంతో మిగిలిన నల్లకుబేరుల్లో ఆందోళన పెరిగింది. మరో వందకుపైగా ఖాతాలు ఆదాయపుపన్ను శాఖ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరంతా ఐటీ బారి నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు.
పెద్ద నోట్లు రద్దయ్యాకనే..
పెద్ద నోట్ల రద్దు తదనంతరం ఐటీ అధికారుల విజిలెన్సు బాగా పెరిగింది. నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చాక జిల్లాలోని వివిధ బ్యాంకుల ఖాతాల్లోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. పరిమితికి మించి జరిగిన లావాదేవీల ఖాతాలను పరిశీలిస్తోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బంగారు వ్యాపారులపై ఐటీ ఫోకస్ పెట్టింది. నోట్ల రద్దు తరువాత వ్యాపారం లేదని గగ్గోలు పెట్టిన జ్యూవెలరీ వ్యాపారులు పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాల్లో వేసిన డిపాజిట్లను బయటకు లాగుతోంది. పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే బంగారు వర్తకుల ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
ఏ రోజు ఎంతెంత నగదు జమైందన్న విషయాలను ఐటీ అధికారులు బయటకు తీస్తున్నారు. తిరుపతి కేంద్రంగా జరిగిన బంగారం అమ్మకాలను పరిశీలించిన ఐటీ అధికారులు అరడజను మంది వ్యాపారులు రూ.4 కోట్లకు పైగా ఖాతాల్లో జమ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెల్సింది. అంతేకాకుండా నోట్ల రద్దు తరువాత జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్ల కొనుగోళ్ల పై కూడా ఆదాయపు పన్ను శాఖ వివరాలు సేకరిస్తోంది. సుమారు వంద మందికి పైగా అక్రమార్కులు కార్ల కొనుగోళ్లపై ఎక్కువ మొత్తం నల్లధనాన్ని మార్చినట్లు సమాచారం.