![నగదు మార్పిడికి సిరా గుర్తు](/styles/webp/s3/article_images/2017/09/4/81479322061_625x300.jpg.webp?itok=Q4oiYell)
నగదు మార్పిడికి సిరా గుర్తు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగదు మార్పిడికి పోస్టాఫీసుల్లో సిరా గుర్తును అమలు చేశారు. ఈ విధానం వల్ల ఒకే వ్యక్తి రెండోసారి నోట్ల మార్పిడికి పాల్పడే అవకాశం లేకుండా పోయింది. నోట్ల మార్పిడికి క్యూలలో రీసైక్లింగ్ విధానం కొనసాగుతున్నట్లు బుధవారం సాక్షి దినపత్రిక 'నోటుకు రెండో వైపు' శీర్షికతో కథనం ప్రచురించింది. బుధవారం పోలీసు బందోబస్తు మధ్య పురుషులు, మహిళలు బారులుదీరి పాత డబ్బును కొత్త నోట్లలోకి మార్చుకున్నారు. కౌంటర్‌లో డబ్బు మార్పిడి చేసుకున్న మరుక్షణమే వేలిపై ఇంకు గుర్తు వేశారు. ఈ పద్ధతి వల్ల రీసైక్లింగ్ విధానానికి అడ్డుకట్ట వేసినట్లయింది. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో బుధవారం ఒకేరోజున డివిజన్ పరిధిలో రూ. 1.72 కోట్ల నోట్ల మార్పిడి జరిగిందని, రూ. 6.30 కోట్ల డిపాజిట్లు సేకరించామని పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆరు రోజుల్లో రూ. 48 కోట్ల డిపాజిట్లు జమ అయినట్లు వివరించారు. ఒక అంధురాలు తమ వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదంటూ ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. నోటు మార్పిడికి అవకాశం లేదని పోస్టల్ సిబ్బంది వెనక్కి పంపారు.