పోస్టాఫీసులో నోట్లు మార్చుకున్న అమెరికన్లు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాల శాఖ సిబ్బంది అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలకు బుధవారం కర్నూలులో డబ్బు మార్పిడి చేసిచ్చారు. అమెరికన్ మహిళలు డొనాకిన్, టెల్మారైట్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ బుధవారం కర్నూలుకు చేరుకున్నారు. పాత నోట్లు చెల్లకపోవడంతో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయానికి వచ్చి తమకు కొత్త నోట్లు కావాలంటూ ఆంగ్లంలో రిక్వెస్టు చేసుకున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే నోట్ల మార్పిడి చేయాలనే నిబంధన ఉండటంతో పోస్టల్ సిబ్బంది కాసేపు సందిగ్ధంలో పడ్డారు. అతిథులను గౌరవించాలనే భారత సంప్రదాయం ప్రకారం డిప్యూటీ పోస్టు మాస్టర్ ఎద్దుల డేవిడ్ కొందరికి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు సమకూర్చి, వాటిపై వారికి అవసరమైన రూ. 32 వేల కొత్త నోట్లను ఇచ్చి పంపారు. వారు పోస్టుమాస్టర్‌తో పాటు పోస్టల్ సిబ్బందికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకున్నారు.