జనమంతా బ్యాం 'క్యూ' లో నే!
జనమంతా బ్యాం 'క్యూ' లో నే!
Published Fri, Nov 11 2016 2:52 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
చాంతాడంత లైన్లు.. గంటల తరబడి నిరీక్షణ
రాజధానితోపాటు రాష్ట్రమంతటా ఇదే సీన్
పలుచోట్ల తోపులాటలు.. బందోబస్తు మధ్య కార్యకలాపాలు
కొన్ని బ్యాంకుల్లో తెరిచిన కొద్ది గంటల్లోనే ఖజానా ఖాళీ
రూ. 2 వేల నోటు అందుకుని మురిసిపోరుయిన ప్రజలు
నోట్ల మార్పిడి, డిపాజిట్లకు పోటెత్తిన జనం
బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు
సాక్షి, హైదరాబాద్: కరెన్సీ కదిలింది.. రెండ్రోజులుగా బీరువాల్లో, పర్సుల్లో, పోపుడబ్బాల్లో అచేతనంగా పడి ఉన్న పెద్ద నోటుకు ప్రాణమొచ్చింది.. బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆపపోపాలు పడుతూ వెళ్లి క్యూ కట్టింది..! తళతళలాడే కొత్త రూపాన్ని ధరించి జేబులో చేరింది!! నిన్నమొన్నటిదాకా పాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లక ఇబ్బందులు పడ్డ జనం గురువారం వాటిని మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు. వారితోపాటు డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినవారితో ఉదయం 8 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. రాజధాని భాగ్యనగరంతోపాటు రాష్ట్రంలో ఎక్కడచూసినా బ్యాంకుల ముందు చాంతాడంత బారులు కనిపించాయి.
పోలీసు బందోబస్తు, గంటల తరబడి పడిగాపుల మధ్య... కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2 వేల నోట్లు అందుకున్న వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. కొన్నిచోట్ల నగదు చాలకపోవడంతో బ్యాంకులు మధ్యాహ్నం వరకే సేవలను నిలిపివేశారుు. దీంతో జనం నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బ్యాంకు కార్యకలాపాలు సాగాయి. అటు జిరాక్స్ సెంటర్‌లు కూడా కిటకిటలాడాయి. నోట్ల మార్పిడికి, డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ పత్రాలు తప్పనిసరి అని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో జనం జిరాక్స్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
గంటల తరబడి పడిగాపులు
జనం ఉదయం 8 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకొని లైన్లలో నించున్నారు. ఉదయం 10.30కు బ్యాంకులు తెరుచుకున్నారుు. ఒక్కో వినియోగదారుడు ఐదారు గంటలకుపైనే లైన్‌లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం బ్యాంకుకు వచ్చిన వారు మధ్యాహ్నం 3 తర్వాతే బయటకు వెళ్లారు. కొత్త రూ.2,000 నోట్లు చెలామణిలోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో అన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి రాలేదు. పలుచోట్ల కొత్త నోట్లను అందుకున్న వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా పెద్దనోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా కకావికలమైన నగరం గురువారం కాస్త తెరిపిన పడింది. చాలా మంది తమ వద్ద ఉన్న పాత నగదును ఖాతాల్లో జమ చేసుకొనేందుకు పోటీ పడ్డారు. ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వాళ్లకు రూ.10 వేల వరకు అవకాశం కల్పించారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
మధ్యాహ్నం వరకే క్లోజ్...
చంపాపేట్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు గురువారం వైద్య చికిత్సల కోసం కోఠీలోని ఈఎన్‌టీ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు సీటీ స్కాన్ రాశారు. వెంటనే తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకొనేందుకు కోఠీలోని ఎస్‌బీఐకి వెళ్లాడు. అప్పటికి మధ్యాహ్నం 2.30 అయింది. అప్పటికే కొత్త రూ.2000 నోట్లు, పాత వంద నోట్లు అయిపోయాయంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. శ్రీనివాస్‌కు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఆరా తీస్తే రూ.50 లక్షల వరకు తాము పై అధికారులను అడిగితే బ్యాంకుకు కేవలం రూ.10 లక్షలే అందజేశారని చెప్పారు. ఒక్క కోఠీలోనే కాదు.. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. విద్యానగర్, కాచిగూడ, చిలకలగూడ, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు మధ్యాహ్ననికే కార్యకలాపాలను నిలిపివేశాయి. మరోవైపు అదనపు కౌంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పినా.. చాలాచోట్ల అది కనిపించలేదు. సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల ఒకట్రెండు కౌంటర్‌లనే ఏర్పాటు చేశారు. దీంతో రద్దీ బాగా పెరిగింది. ఈస్ట్, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో సర్వర్ డౌన్ వల్ల కొన్ని బ్యాంకుల్లో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి.
పోస్టాఫీసుల్లో గందరగోళం...
రాజధానిలో పలుచోట్ల పోస్టాఫీసుల్లోకి కొత్త కరెన్సీ, వంద నోట్లు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో క్యూలో నించున్న వారు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పంపిణీ మొదలైంది.
తప్పని చిల్లర తిప్పలు
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితోపాటు పలు జిల్లాల్లో గురువారం కూడా జనానికి చిల్లర తిప్పలు తప్పలేదు. చిల్లర లేక పెట్రోల్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కోదాడ పట్టణ సమీపంలో చిల్లర ఇవ్వలేదంటూ జగ్గయ్యపేట డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ ప్రయాణికులను కోదాడ శివారులో దింపేశాడు. ఇక సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 130 బ్యాంకుల్లో గురువారం ఒక్కరోజే రూ.వంద కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర జమ అరుునట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాల్లో 367 బ్యాంకులకు జనం క్యూ కట్టారు. పోస్టాఫీస్‌లో డబ్బుల మార్పిడి జరగలేదు. డిపాజిట్‌లు మాత్రమే చేశారు.
కొత్తనోటు చూడముచ్చటగా ఉంది
కొత్త రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి ఉదయ మే బ్యాంకుకు వెళ్లాను. భారీ క్యూలైన్‌లో నిలబ డి నోటు చేతికి తీసుకు న్నాను. నోటు కొత్తగా ఉంది. పాత వెయి నోటు అంత అందంగా లేకున్నా చూడముచ్చటగా ఉంది. - తుమ్మలపల్లి మహేశ్, హైదరాబాద్
కాస్త భిన్నంగా ఉంది
పాత వెయి నోటు కంటే రూ.2 వేల నోటు కొంత భిన్నంగా ఉంది. మూడు గంటల పాటు లైన్‌లో నిలబడి పాత నోట్లను మార్పిడి చేసుకున్నాను.
- బాలు, హైదరాబాద్
రెండోరోజూ స్తంభించిన మార్కెట్లు
రెండోరోజు కూడా హైదరాబాద్‌లోని మార్కెట్‌లు కళా విహీనంగానే కనిపించారుు. అన్నిచోట్ల కార్యకలాలు స్తంభించారుు. రిటైల్, హోల్‌సేల్ మార్కెట్‌లు వెలవెలబోయారుు. సికింద్రాబాద్ జనరల్ బజార్, రాణిగంజ్, మోండా మార్కెట్. కోఠి, మలక్‌పేట్, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, తదితర ప్రాంతాల్లో గిరాకీ లేక వ్యాపారులు ఉసూరుమన్నారు. నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్ వంటి ప్రాంతాలు కూడా వెలవెలబోయారుు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్‌లలోనూ వ్యాపారం ఇంకా జోరందుకోలేదు.
Advertisement
Advertisement