రాకెట్, ఉపగ్రహం నమూనాలతో ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్
స్వదేశీ క్రయోజనిక్ ప్రయోగంలో ఇస్రో హ్యాట్రిక్ విజయం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ఉపగ్రహ వాహకనౌక ద్వారా వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఆర్‌ను రోదసిలోని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక దశల ప్రయోగంలో వరుసగా మూడో విజయం సాధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 4:50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 రాకెట్.. 17 నిమిషాల తర్వాత ఇన్‌శాట్-3డీఆర్‌ను భూ సమాంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇన్‌శాట్-3డీఆర్ పనిచేయని ఇన్‌శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది.
ప్రయోగం ఇలా జరిగింది...: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 రాకెట్ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11:10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 29:40 గంటల పాటు కొనసాగింది. గురువారం సాయంత్రం 4:10 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. క్రయోజనిక్ దశలో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియలో ఒక సేఫ్టీవాల్వ్ క్లోజ్ కాకపోవడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 2.53 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ నిలిచిపివేసి.. లోపాన్ని సవరించారు. దీంతో ప్రయోగం 40 నిమిషాలు ఆలస్యమైంది. లోపం సవరించాక 4:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
స్వదేశీ క్రయోజనిక్‌లో ఇస్రో హ్యాట్రిక్
జీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో ఇస్రో పది ప్రయోగాలు చేయగా.. తాజా ప్రయోగంతో ఏడో విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. దేశీయంగా అభివృద్ధి చేసిన సంక్లిష్ట క్రయోజనిక్ దశ ప్రయోగంలో విజయాల హాట్రిక్ సాధించింది. అయితే.. తాజా ప్రయోగంలో.. దేశీయంగా రూపొందించిన క్రయోజనిక్ అప్పర్ స్టేజ్‌ను వినియోగించటంతో ఇది ఇస్రోకు చాలా ప్రధానమైన ప్రయోగంగా నిలిచింది. ఇంతకుముందు 2014 జనవరిలో జీశాట్-14 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపిన జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్‌లోను, 2015 ఆగస్టులో జిశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-డి6 రాకెట్‌లోనూ దేశీయంగా రూపొందించిన సీయూఎస్‌ను ఉపయోగించారు.
అయితే.. అవి రెండూ అభివృద్ధి దశలో ఉన్నాయని.. వాటిలో రష్యా ఇంజన్లను ఉపయోగించామని.. తాజా ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సీయూఎస్‌ను ఉపయోగించామని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ ఇంజన్‌కు సంబంధించి 2010లో జంట వైఫల్యాల అనంతరం 2014లో ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం ఈ రంగంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరింది.
వాతావరణ విపత్తులపై నింగిలో నిఘా నేత్రం
భూమి, సముద్రాలపై వస్తున్న విపత్తులను ముందుగా కనిపెట్టి హెచ్చరించేందుకు వాతావరణ అధ్యయనం కోసమే ఇన్‌శాట్-3డీఆర్‌ను ప్రయోగించినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ వాతావరణ ఉపగ్రహంలో 6-చానల్ ఇమేజర్, 9-చానల్ సౌండర్ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్‌పాండర్స్ (డీఆర్‌టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్‌ఏఎస్ అండ్ ఆర్) పరికరాలను అమర్చి పంపారు. భూమిపై, సముద్రాలపై జరిగే మార్పులను ఛాయాచిత్రాలు తీసేందుకు 6 చానల్ ఇమేజర్‌ను ఉపయోగిస్తారు. వాతావరణం మీద అధ్యయనం చేయడానికి కల్పన-1, ఇన్‌శాట్-3ఏ అనే ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. అయితే.. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండటంతో గత ఉపగ్రహాల కంటే ఇందులో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలను అమర్చారు.
‘సముద్రం అడుగు నుంచి విమాన సంకేతాలు అంతరిక్షానికి చేరవు’
బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం విషయంలో.. సముద్రం అడుగు నుంచి విమానం సంకేతాలు అంతరిక్షం వరకు చేరవని ఇస్రో చైర్మన్ కిరణ్ చెప్పారు. ‘విమానం సముద్రం లోపలికి వెళితే, దాని సంకేతాలు అంతరిక్షం వరకూ చేరవు. భూమిపై విపత్తు సంభవిస్తే విమానంలోని బీకన్లు సంకేతాలు పంపుతాయి. వాటిని ఈ ఉపగ్రహంలోని ట్రాన్స్‌పాండర్ అందుకుంటాయి.’ అన్నారు.
‘ఆదిత్య’కు సిద్ధం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భవిష్యత్తులో సూర్యుడి మీద పరిశోధనలు చేయడానికి ఆదిత్య, చంద్రుడి మీద పరిశోధనలు చేయడానికి చంద్రయాన్-2, అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి మంగళ్‌యాన్-2 ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోందని చైర్మన్ కిరణ్‌కుమార్ తెలిపారు. ప్రయోగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది మోదీ ఆలోచనలకు అనుగుణంగా ‘మేకిన్ ఇండియా’ ప్రయోగం. క్రయో దశతో వరుసగా 3ప్రయోగాలు చేసి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి, ప్రధాని మోదీ అభినందించారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం కావడంపై ‘ఇస్రో’ శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రజ్ఞులు మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా చేయాలని ఆయన ఆకాంక్షించారు.