నకిలీ విత్తనాలపై తనిఖీలు ముమ్మరం
నకిలీ విత్తనాలపై తనిఖీలు ముమ్మరం
Published Thu, Jun 1 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
కర్నూలు(అగ్రికల్చర్): నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసేందుకు ఒక వైపు విజిలెన్స్ అధికారులు, మరోవైపు వ్యవసాయాధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. తెల్లబంగారం... విత్తు కలవరం అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపధ్యంలో అధికారులు స్పందించారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు.. కర్నూలు నగరంలోని నవత, ఎస్‌ఆర్‌ఎంటీ తదితర ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించారు.
కోడుమూరు తదితర ప్రాంతల్లోనూ తనిఖీలు సాగాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల నిర్వహించిన దాడుల్లో ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా చేసిన రూ.5లక్షల విలువ చేసే నాలుగు క్వింటాళ్ల నకిలీ బీటీ విత్తనాలను స్థానిక వ్యవసాయాధికారి స్వాధీనం చేసుకున్నారు. మే నెల 26న కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటులోని పోలీసు కాలనీ నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. నంద్యాలలో రూ.34 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుబడటం సంచలనం రేపింది. పత్తిలో 95 శాతం బీటీ రకాలనే సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నకిలీ విత్తనాలు ఇప్పటికే తరలివెల్లినట్లు సమాచారం.
నకిలీ బీటీ పత్తి విత్తనాలు సీజ్
నంద్యాలఅర్బన్: స్థానిక విజయ డెయిరీ సమీపంలోని వెంకటేశ్వర సీడ్స్ విత్తన కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ బీటీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. జిల్లా విజిలెన్స్ అధికారి బాబురావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి, ఏడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. సీడ్ ప్రాసెసింగ్‌కు అనుమతులు లేకుండా సీడ్ కంట్రోల్ నిబంధనలు అతిక్రమించి నకిలీ బీటీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు రూ.11.76లక్షల విలువ చేసే 28 క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. అయితే బండిఆత్మకూరుకు చెందిన రైతు కావేరి బీటీ పత్తి విత్తనాలను సీడ్ విత్తనాల ప్రాసెసింగ్‌కు ఇక్కడ నిల్వ ఉంచినట్లు వెంకటేశ్వర సీడ్స్ యజమాని విజిలెన్స్ అధికారులకు వివరించారు. రైతుకు సంబంధించిన వివరాలు తెలపకపోవడంతో సంచుల్లో ఉంచిన సీడ్ మొత్తాన్ని సీజ్ చేసి టెక్కె మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలించారు. సీడ్ యజమానిపై 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. వీరి వెంట ఏఓ అయూబ్‌బాషా, విజిలెన్స్ సిబ్బంది మునిస్వామి, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement