- తగు సమయంలో గుర్తిస్తేనే దిగుబడులు
- తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం
సోయా పంటలో పొంచి ఉన్న చీడపీడలు
Published Wed, Jul 20 2016 10:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో సోయా పంటను ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో దాదాపుగా లక్ష హెక్టార్ల వీస్తీర్ణంలో రైతులు పంట విత్తుకున్నారు. 35 రోజుల నుంచి 45 రోజుల దశలో ఉంది ప్రస్తుతం ఎదిగే దశకు చేరుకుంది.
ఈ పంటలో వివిధ రకాల చీడపురుగులు ఆశించి దిగుబడులను నష్టపర్చే ప్రమాదం ఉంది. దీనికోసం సరైన సమయంలో సస్యరక్షణ చర్యలను చేపట్టి దిగుబడులను కాపాడుకోవాల్సిన అసవరం ఉందని ఏరువాక కోర్డినేటర్ శాస్త్రవేత్త రాజశేఖర్ వివరిస్తున్నారు. అయితే ముందుగా పంటను ఆశించే వివిధ రకాల చీడపీడల గురించి తెలుసుకుందాం.
పల్లాకు తెగులు..
ఆకు పచ్చని రంగులో కళకళలాడాల్సిన సోయా పంట పసుపు రంగులోకి మారుతుంది. పల్లాకు తెగులు సోకిన సోయా పంట ఆకుల మీద పసుపు పచ్చని పొర ఏర్పడి మొత్తం ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈ తెగులు సోకిన మొక్కలలో కాయలు ఏర్పడవు. తెగులు కారక వైరస్ తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
– దీన్ని నివారించేందుకు ముందుస్తుగా రైతులు 15 గ్రాముల కార్బోనల్ఫాన్ లేదా 3 గ్రాముల మిడా క్రోసిన్‌తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
– వ్యాధి సోకిన మొక్కలకు వెంటనే పొలంలో నుంచి తీసి వేసి కాల్చివేయాలి.
– 40 శాతం తెగులు సోకిన పంటకు తెగులు మరింత వ్యాప్తి చెందకుండా, ఉన్న వరకు కాపాడుకునేందుకు పంపునకు 5 గ్రాముల ఎసిటిమిఫ్రైడ్ లేదా 24 మి.లీ ట్రైజోఫాస్‌ను పిచికారీ చేసుకోవాలి.
+ పంటకు సోకే పల్లాకు తెగులు(ఎల్లో మొజాయిక్) తెల్లదోమ అను వైరస్ కారణంతో సోకుతుంది. విత్తన శుద్ధి చేయకపోవడం వంటి కారణాలతో సోయా పంటను నాశనం జరుగుతుంది.
రసం పీల్చు పురుగులు
(తామర పురుగులు, తెల్ల, పచ్చదోమలు, పేనుబంక)
చిన్న పరిమాణంలో ఉండి ఆకుల నుంచి, లేత చిగురుల నుంచి లేత కాండం నుంచి రసాన్ని పీల్చి పంటకు నష్టం కలిగిస్తాయి. ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వలన ఆకులు పసుపు, గోధుమ రంగుకు మారి, మొక్క ఎదుగుదల లోపిస్తుంది.
నివారణ..
తామర పురుగుల ద్వారా మొవ్వ కుళ్లు, తెల్ల దోమల వల్ల మొజాయిక్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి.
రసం పీల్చు పురుగుల నివారణకు పొలంలో పసుపు, నీలి రంగు జిగురు ఆకర్షక ఎరలను ఉంచాలి. వీటికి పురుగులు ఆకర్షించబడి జిగురుకు అతుక్కుని చనిపోతాయి.
ఉధతి ఎక్కువగా ఉంటే ఎసిఫేట్ 1.5గ్రా. (లేదా) డైమిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకుతినే పరుగులు
దాసరి పురుగు/ నామాల పురుగు..
వీటి రెక్కల పురుగు వెనక జత రెక్కల మధ్యలో తెల్లని చారలు ఉండి, ముదురు గోధుమల రంగు చుక్కలు వెలుపలి అంచువెండి ఉంటాయి. మీద రెక్కలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆకులపై గుడ్లను ఉంచుతాయి. ఇవి పొదిగి లద్దె పురుగులుగా మారి ఆకులను గీకి తింటాయి. ముదిరిన లద్దె పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి తింటాయి. బాగా పెరిగిన పురుగులు భూమిలో గాని, ఆకులలో గాని కోశస్థ దశలుగా రూపాంతరం చెందుతాయి.
నివారణ
మొదటి దశ లార్వాలను గుర్తించిన వెంటనే వేపనూనె 5 మి.లీ/లీ పిచికారీ చేయాలి
– బాక్టీరియా సంబంధిత మందులు (డైపెల్)ను 400 గ్రామ/ఎకరానికి పిచికారీ చేయాలి.
– పెద్ద పురుగులను ఏరి తినేందుకు వీలుగా పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. ఎకరానికి 10 చొప్పున అమర్చాలి.
– పురుగు ఉధతి ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్ 1.6మీ.లీ./లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ/లీ. మందును పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు
వీటి రెక్కల పురుగులు ఆకుల మీద సమూహాలుగా గుడ్లను ఉంచుతాయి. వీటి నుంచి పిల్ల పురుగులు పొదిగి ఆకుల మీద పత్ర హరితాన్ని గోకి తింటాయి. ముదిరిన లద్దె పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా జల్లెడగా మారుస్తాయి. లేత ఆకులను పూర్తిగా తినేస్తాయి. పువ్వులను, కాయలను కూడా ఇవి నష్టపరుస్తాయి. ఇవి తెలుపు నుంచి బూడిద వర్ణంలో ఉండి నల్లటి మచ్చలను కలిగి ఉంటాయి. ఇవి రాత్రిపూట మాత్రమే పంట మీద తింటూ, పగటి వేళల్లో మొక్క మొదళ్ల వద్ద లేదా భూమి నెర్రెలలో దాక్కొని ఉంటాయి. బాగా ఎదిగిన లద్దె పురుగలు కోశస్థ దశలోకి మారతాయి.
నివారణ:
– గుడ్ల సముదాయం కనిపించిన ఆకులను గుడ్లతో సహా నాశనం చేయాలి.
– లేత లార్వాల సముదాయం ఉన్న ఆకులను గమనించి కత్తిరించి దూరంగా నాశనం చేయాలి
– తొలి దశలో వేపనూనె 5 మి.లీ/ లీ లేదా బ్యాక్టీరియా సంబంధిత మందులు (బి.టి) డైపెల్‌ను 2 గ్రా/లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
– పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ‘‘ఖీ’’ ఆకారపు కర్రలను ఎకరానికి 10 చొప్పున ఉంచాలి.
– మూడో దశ దాటిన పురుగు (10–12సెం.మీ.) అదుపు చేయడానికి విషపు ఎరలను పొలంలో ఉంచాలి. (ఎకరానికి 10 కిలోలు తవుడు, 2కిలోలు బెల్లం, 500–750 మి.లీ. క్లోరిౖఫైరిఫాస్ మందు కలిపిన మిశ్రమానికి ఉండలు చేసి సాయంత్రం వేళల్లో పొలమంతా వెదజల్లాలి.
– పురుగు ఉధతి బాగా ఎక్కువగా ఉంటే– థయోడికార్డ్ 1.5 గ్రా/లీ. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ./లీ లేదా ఎమమెక్టిన్‌బెంజోయేట్ 0.5 గ్రా/లీ. మందును పిచికారి చేయాలి.
– పురుగు మందులను సాయంత్రం వేళల్లో పిచికారి చేస్తే నివారణ తొందరగా జరిగి మంచి ఫలితం ఉంటుంది.
కాండం తినే పురుగులు:
కాండపు ఈగ
తల్లి ఈగలు నలుపు రంగులో మెరుస్తూ చురుగ్గా తిరుగుతూ ఉంటాయి. ఇవి లే ఆకుల మీద, చిన్న గుంటలు చేసి గుడ్లను ఉంచుతాయి. వీటి నుండి పొదిగిన లార్వాలు దగ్గరలోని ఆకు కాడల ద్వారా కాండలంలోనికి రంధ్రం చేసి ప్రవేశిస్తాయి. కాండం లోపలి పదార్థాన్ని మొత్తం తినడం వల్ల మొక్కలు వడలి ఎండి చనిపోతాయి. ఇవి కాండం నుండి వేర్ల వరకూ కూడా తింటాయి. లార్వా నుండి తల్లి పురుగు కాండానికి రంధ్రం చేసి బయటకు వస్తుంది.
వడలిన మొక్కల కాండాలను కత్తిరించి చూస్తే లోపల చిన్న పసుపు రంగు లార్వా కనిపిస్తుంది. లార్వా వదలిన వ్యర్థ పదార్థం కూడా కాండంలో ఉండడం గమనించవచ్చు. ఈ పురుగు వల్ల పంటకు కనీసం 20–25శాతం నష్టం వాటిల్లుతంది.
నివారణ:
తొలి దశలో రక్షణ కోసం ఫోరేట్ 10గ్రా. లేదా కార్థోప్యూరాన్ 3 గ్రా. గుళికలను పొలంలో చల్లుకోవాలి. పైరుపై ఆశించినపుడు నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ./లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా/లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పెంకు పురుగు/ కాండం తొల్చే పురుగు..
దీని వల్ల పంటకు సుమారుగా 40–50 శాతం నష్టం వాటిల్లుతుంది. ఈ పురుగు జూలై నుంచి అక్టోబర్ వరకు ఆశిస్తుంది. ముందుగా ఆడ పెంకు పురుగు కాండం మీద 10 సెం.మీ. దూరంలో కాండం చుట్టూ రంధ్రాలు చేస్తుంది. దీనివల్ల చిగురు భాగానికి పోషకాలు, నీరు అందక వడలి ఎండిపోతుంది. ఇలా చేసిన రంధ్రాల ద్వారా గుడ్లను కాండంలో ఉంచుతుంది. ఈ గుడ్లు పొదిగి లార్వాలు కాండాన్ని తొలిచి తినడం మొదలు పెడతాయి.
నివారణ
– చిగురులు ఎండిపోతున్న మొక్కలను పీకి నాశనం చేయడం వల్ల పురుగు వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చు.
– తొలి దశలో కార్థోఫ్యూరాన్‌గుళికలు చల్లుకోవడం వల్ల కొంతవరకు తల్లి పురుగులను అదుపులో ఉండవచ్చు.
– పైరుపై పురుగు ఆశించినట్లయితే, క్లోరిఫైరిఫాస్ 2 మి.లీ./లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ./లీ. లేదా ట్రైజోఫాస్ 2.0 మి.లీ./లీ. నీటిని కలిపి పిచికారీ చేయాలి.
Advertisement