
ఎమ్మెల్యేకు అవమానం
♦ సమస్యలపై సీఎంకు వినతిపత్రమిచ్చిన తిప్పారెడ్డి
♦ హెలిప్యాడ్ సమీపంలోనే పడేసిన ముఖ్యమంత్రి
మదనపల్లెః రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉంటుందో తెలిపే సంఘటన ఇది. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రాన్నే కింద పడేసిన వైనం మిది. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి స్వయంగా నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివా రం మదనపల్లె పర్యటనకు వచ్చిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద సీఎంను కలసి 13 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. అయితే అది ఆదివారం హెలిప్యాడ్ సమీపంలో నేలపై స్థానికులకు కనిపించింది. వారు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకి, పాత్రికేయులకు ఫోన్‌చేసి తెలిపారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా? నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు వినతిపత్రం అందజేస్తే హెలిప్యాడ్ వద్దే పడవేయడం చూస్తే ఇక ఆయన నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారన్న సందేహం కలుగుతోంది. కేవలం ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేనన్న కక్ష సాధింపుతోనే ఇలా చేశారు. ఈ చర్య నియోజకవర్గంలోని 4 లక్షల మంది ప్రజలను అవమానించినట్లే. ప్రజాప్రతినిధి, ప్రజల మనోభావాలను అవహేళన చేసిన ఆయనపై గౌరవం పోయింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి.
- డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే