ఆంధప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయం ఎలా సాగిపోతోందో తెలుసా? హిందూపురం ఎమ్మెల్యే, బాబుగారి బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ఇంటర్వ్యూ మాదిరిగా సాగుతోందని అనవచ్చు. ఎందుకంటారా? ఆ ఇంటర్వ్యూలో మాదిరిగానే బాబుగారిని పచ్చమీడియా ఓ పొగిడేస్తోంది కాబట్టి.. భారీగా బిల్డప్ ఇచ్చి నిలబెడుతోంది కాబట్టి!! అన్‌స్టాపబుల్ అంటే నిరాఘాటంగా అని తెలుగు అర్థం.
మామూలుగానైతే ఓ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అంటే అందులో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజా సమస్యలు వంటివి చర్చకు వస్తూంటాయి. అధికారం చేపట్టి నాలుగు నెలలైన నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడతారని ఆశిస్తాం. కానీ.. అలాంటివేవీ ఇందులో కనిపించవు. సానుకూల దృక్పథంతో మాట్లాడుకోవడం వరకూ ఓకే కానీ.. అచ్చంగా భజన కోసమన్నట్టుగా ముఖాముఖి నిర్వహిస్తేనే సమస్య. బాలకృష్ణ సినీ నటుడు కనుక, ఆయనకు ఏదో గ్లామర్ ఉంటుంది కనుక దానిని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. చంద్రబాబు ప్రజలను మాయ చేయడానికి ఈ గ్లామర్‌తోపాటు తన అధికారాన్ని కూడా వాడుకుంటున్నారు. ఏతావాతా ఎల్లో మీడియాలో వచ్చిన స్టోరీ అంతటిని చదివితే ఏమని అనిపిస్తుందంటే చంద్రబాబు, బాలకృష్ణలు, అన్ స్టాపబుల్‌గా అబద్దాలు చెప్పుకున్నారూ అని! తనకు, తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనపై వచ్చిన స్కిల్ స్కామ్ తదితర కేసులను నీరు కార్చడానికి ఈ ప్రోగ్రాం వేదికగా చంద్రబాబు ఒక ప్రాతిపదికను సిద్దం చేసుకుంటున్నారని అనిపించింది.
ఇప్పటికే తనపై వచ్చిన అవినీతి కేసులను నీరుకార్చడానికి సన్నాహాలు ఆరంభించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన జీవితంలో ఏనాడు కక్ష రాజకీయాలకు పాల్పడలేదని ఆయన చెప్పారట. తనకు రాజకీయంగా పోటీ వస్తారని భావించి కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్ పై అక్రమ కేసులు పెట్టడం కక్ష రాజకీయం కాదన్నమాట. జగన్ టైమ్‌లో పలు స్కీములకు, ప్రాజెక్టులకు ఆయా ప్రముఖుల పేర్లు పెడితే వాటిని తాను అధికారంలోకి రాగానే తొలగించడం కక్ష రాజకీయం కాదట. ఉదాహరణకు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు దివంగత నేతలు గౌతంరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డిల పేర్లు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని తొలగించి వేసింది.
తనను అరెస్టు చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. అంతవరకు ఒప్పుకోవచ్చు. తప్పు చేసినా, చేయకపోయినా, అరెస్టు కావాలని ఎవరూ కోరుకోరు కదా! కానీ అదే సందర్భంలో తాను చట్ట ధిక్కరణ చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏపీ సీఐడీ ఆధారాలతో ప్రభుత్వ డబ్బు రూ.300 కోట్లు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయిందని కేసు పెట్టింది కదా? దానిని ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు నిర్దారించారు కదా? ఈ కేసులో పలువురిని అరెస్టు కూడా చేశారు కదా? టీడీపీ ఖాతాలోకి సుమారు రూ.అరవై కోట్లు వచ్చిందని సీఐడీ వివరాలు ఇచ్చింది కదా? అలా జరగలేదని టీడీపీ ఎందుకు చెప్పలేకపోయింది? అసలు ఆ కేసు విచారణకు పిలుస్తారని భావించి, తన పీఏ శ్రీనివాస్‌ను అకస్మాత్తుగా అమెరికా పంపించడం అవాస్తవమా? నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకు వెళతామని చెబితే ఒప్పుకోకుండా బస్‌లో ప్రయాణించింది దేని కోసం?. రాజమండ్రి జైలులో ఈయన ఏసీ కావాలని అడిగితే ప్రభుత్వం సమకూర్చలేదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే,వాటినే తాను వాడుకుంటూ అప్పుడేదో అనుమానస్పద ఘటనలు జరిగాయని చెప్పడం ఇన్నేళ్ల సీనియర్ నేతకు తగునా?.
.. ఇక బావమరిది బాలకృష్ణ ఇచ్చిన ఎలివేషన్ చూడండి. చంద్రబాబు అరెస్టుతో భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు అదిరిపోయారట. కన్నీళ్లు పెట్టుకున్నారట. ‘‘ఆయన అసలు గీత దాటని మనిషి. ప్రజలే ఆయన కోసం గీత దాటారు’’ అని మాట్లాడారు ఆయన. మీడియా చేతిలో ఉంటే ఎలా బాజా బజాయించుకోవచ్చో ఈ ఇంటర్వ్యూ తెలియ చేస్తుంది. జైలులో మొదటి రాత్రి అనుభవాలు ఏమిటని బాలకృష్ణ అడగడం, చంద్రబాబేమో దానికి వైనవైనాల వర్ణనలతో సమాధానం ఇవ్వడం భలేగా ఉంది.
ఏ వ్యక్తిని అయినా పోలీసులు అరెస్టు చేస్తే, ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో, దానినే అప్పుడు కూడా అనుసరించారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చి, తనను రాత్రి తిప్పారని, విచారించారని చెబుతున్న తీరు ఇప్పటికీ దాని ద్వారా సానుభూతి పొందాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి కాదు. తన సోదరి భువనేశ్వరి, తదితర కుటుంబ సభ్యులు అప్పట్లో చేసిన ఆందోళనలను కూడా బాలకృష్ణ ప్రస్తావించుకున్నారు.
మరో హైలైట్ ఏమిటంటే ఆకాశంలో సూర్యచంద్రులు, ఆంధ్రాలో బాబు, కళ్యాణ్ బాబు అని అంటున్నారట.నిజమా? మరి ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వారిని అలగా జనం అని బాలకృష్ణ ఎందుకు గతంలో సంబోధించారో? పవన్ కళ్యాణ్ ,చంద్రబాబులు కలిసి పోటీ చేయాలని అనుకోవడం చారిత్రక సన్నివేశంగా చూపించడానికి బాలకృష్ణ యత్నించారు. విజయవాడలో వరదలలో చంద్రబాబు చాలా కష్టపడ్డారని ప్రొజెక్షన్ ఇవ్వడానికి బాలకృష్ణ తంటాలు పడ్డారు.
చంద్రబాబు కలెక్టరేట్‌లో బస్‌లో బస చేయడం, పడవ ఎక్కడం అన్ని ఎవరూ చేయలేని పనులు అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. మరి అసలు వరదలు రావల్సిన అవసరం ఏమిటి? పది రోజులపాటు లక్షల మంది ఎందుకు నానా పాట్లు పడ్డారు? చంద్రబాబు కృష్ణ నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో నివసిస్తున్నారా?లేదా? ఆ ఇంటిలోకి వరద నీరు చేరడంతోనే ఆయన బస మార్చింది అవాస్తవమా? అసలు వరదలే రాని ప్రాంతంలో వరదలు వచ్చినందుకు వారు బాధపడినట్లు లేదు. పది రోజుల్లో సాధారణ పరిస్థితి తెచ్చామని జబ్బలు చరుచుకున్నారు.
మరో కీలక అంశం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసి నెయ్యి వాడారన్న ఆరోపణ గురించి బాలకృష్ణ ప్రశ్నించినా ,చంద్రబాబు జవాబు దాటవేశారనే అనుకోవాలి. సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి వదలివేశారు. మరి అంతకుముందు జగన్ పై అన్యాయమైన ఆరోపణలు ఎందుకు చేసినట్లు? అది కక్ష రాజకీయం కాదా? యథా ప్రకారం అమరావతి కల గురించి కూడా ప్రశ్నించారు. ఆయన ఎప్పటి మాదిరి సైబరాబాద్ తనదేనని, హైదరాబాద్ ను తానే అభివృద్ది చేశానని చెప్పుకున్నారు. ఇంతకీ అసలు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల గురించి ఒక్క మాట అడిగితే ఒట్టు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు, బాలకృష్ణలు కలిసి ఆడిన మరో అన్ స్టాపబుల్ డ్రామాగా దీనిని అభివర్ణించుకోవచ్చేమో!.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment