బీమా కరువు! | insurance not give and farmer problems | Sakshi
Sakshi News home page

బీమా కరువు!

Published Thu, Jul 27 2017 10:34 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

బీమా కరువు!

బీమా కరువు!

పంట రుణాల రెన్యూవల్స్‌ ముందస్తుగానే ప్రారంభించినా ఫలితం లేకుండా పోతోంది. వాతావరణ బీమా పథకం వర్తింపునకు జూలై 15 ఆఖరు కావడంతో.. సుమారు 50వేల మంది రైతులు బీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

కనికరించని ప్రభుత్వం
- బీమా ప్రీమియం చెల్లింపునకు ముగిసిన గడువు
- ఇప్పటి వరకు పొడిగింపునకు ససేమిరా
- జిల్లాలో 50వేల మంది రైతుల నిరీక్షణ
- చిన్న, సన్నకారు రైతులే అధికం
- నోరు మెదపని అధికార పార్టీ నేతలు


5.50 లక్షలు : జిల్లాలో వేరుశనగ రైతులు
రూ.4,246 కోట్లు : పంట రుణాల రెన్యూవల్స్‌ లక్ష్యం
రూ.3,800 కోట్లు : పూర్తయిన రెన్యూవల్స్‌
4.60 లక్షలు : వాతావరణ బీమా పరిధిలోని రైతులు
50వేలు : బీమా కోల్పోతున్న రైతులు
జూలై 15 : ముగిసిన రెన్యూవల్స్‌ గడువు


అనంతపురం అగ్రికల్చర్‌: పంట రుణాల రెన్యూవల్స్‌ ముందస్తుగానే ప్రారంభించినా ఫలితం లేకుండా పోతోంది. వాతావరణ బీమా పథకం వర్తింపునకు జూలై 15 ఆఖరు కావడంతో.. సుమారు 50వేల మంది రైతులు బీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో మౌలిక వసతులు లేకపోవడం.. సిబ్బంది కొరత.. సర్వర్‌తో సాంకేతిక సమస్యలు.. నగదు కొరత.. ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీతో పాటు సరైన ప్రణాళిక లేకపోవడంతో రెన్యూవల్స్‌, కొత్త రుణాల పంపిణీ మందగించింది. ఈ ఖరీఫ్‌లో అన్ని బ్యాంకుల ద్వారా రూ.4,245 కోట్ల పంట రుణాలు రెన్యూవల్‌ చేయాలనేది బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యం.

పంట రుణ పరిమితి(స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) ఆధారంగా రైతుల వాటా 2 శాతం ప్రీమియం చెల్లిస్తే.. మిగతా 8 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కంపెనీకి ప్రీమియం జమ చేస్తాయి. 2 శాతమే అయినా.. జిల్లా రైతులపై రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు భారం పడుతుంది. మే మొదటి వారం నుంచి రెన్యూవల్స్‌ ప్రారంభం కావడంతో గడువులోగా ముగిసే అవకాశం ఉంటుందని భావించారు. అయితే వివిధ కారణాలతో కటాఫ్‌ తేదీ జూలై 15 నాటికి రూ.3,800 కోట్ల రెన్యూవల్స్‌ పూర్తి కాగా.. 4.60 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. చివరి రోజు సర్వర్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో రెన్యూవల్స్‌ తక్కువయ్యాయి. ఇప్పటికీ వేలాది మంది రైతులు రెన్యూవల్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీలే ఉండటం గమనార్హం.

గతేడాది 5.10 లక్షల మంది రెన్యూవల్స్‌
గతేడాది జూలై 15 నాటికి 5.10 లక్షల మంది రైతులు రెన్యూవల్స్‌ చేయించుకోవడంతో బీమా పరిధిలోకి రావడంతో.. 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్ల వాతావరణ బీమా కింద పరిహారం విడుదలయింది. రేపోమాపో రైతుల ఖాతాల్లోకి బీమా పరిహారం జమ చేయనున్నట్లు లీడ్‌ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి ఎంతలేదన్నా 50వేల మంది రైతులకు వాతావరణ బీమా పథకం వర్తించే పరిస్థితి లేదు.

ఆందోళనలు చేసినా..
వర్షాలు లేకపోవడం, పంటల సాగు పడకేయడం, బ్యాంకుల్లో నెలకొన్న సమస్యల కారణంగా ఈ సారి ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించే అవకాశం ఉంటుందని ఊహించారు. ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించాలని, కనీసం జూలై నెలాఖరు వరకైన సమయం ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులపై ఒత్తిడి తేవడంతో పాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పొడిగించాలంటూ కలెక్టర్, జేడీఏ, ఎల్‌డీఎం కార్యాలయాల నుంచి స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ), బీమా పథకం అమలు చేస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌ కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచి సీఎంపై ఒత్తిడి తీసుకురావాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అవకాశం లేనట్లే..
గడువు పొడిగించాలని కోరినా.. ఇప్పటికి అవకాశం కనిపించట్లేదు. జూలై 15 వరకు నిర్వహించిన రెనూవల్స్, ప్రీమియం, ఎన్ని హెక్టార్లు, ఎంత మంది రైతులు అనే వివరాలు అప్‌లోడ్‌ చేసి ఈ నెలాఖరు లోగా పంపాలనే ఆదేశాలు ఉండటంతో ఆ పనిలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రీమియం చెల్లింపు గడువు పొడిగిస్తారా లేదా అనేది సందేహమే. నాలుగైదు బ్యాంకులు మినహా మిగతా వాటిలో 15 నుంచి 20 శాతం మంది రైతులు బీమా పరిధిలోకి రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కచ్చితమైన వివరాలు అందాల్సి ఉంది.
- ఎల్‌.జయశంకర్, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement