అసలే.. ఆ ఎమ్మెల్యేకు తలబిరుసు.. పైగా అనేక అవినీతి ఆరోపణలు..
- ఓ వివాదాస్పద ఎమ్మెల్యేకు అండ
- సమాచారాన్ని లీకుచేస్తున్న ఓ అధికారి
- ప్రభుత్వానికి పంపకుండా తొక్కిపెడుతూ..
- సర్కారుకు మాత్రం తప్పుడు నివేదికలు
- అసమ్మతిపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు
అసలే.. ఆ ఎమ్మెల్యేకు తలబిరుసు.. పైగా అనేక అవినీతి ఆరోపణలు.. వెరసి వివాదాస్పద ఎమ్మెల్యే అన్న ముద్ర.. అటువంటి ప్రజాప్రతినిధికి ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి సొంత వేగులా మారాడు.. సొంతిల్లులాంటి తన విభాగానికి వచ్చే సమాచారాన్ని సదరు ప్రజాప్రతినిధికి లీక్ చేస్తూ తొత్తులా వ్యవహరిస్తున్నాడు.
ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు.. అది అమలు చేస్తున్నామని చెబుతున్న పథకాలపై జనస్పందన ఏమిటి.. ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి ఎలా ఉంది.. ప్రధాన ప్రతిపక్షం ఏ మేరకు బలం పుంజుకుంటోంది.. ప్రజాసంఘాల ఉద్యమాల ప్రభావం ఏమేరకు ఉంది.. వర్తమాన రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి... మొత్తంగా జననాడి ఎలా ఉందో పసిగట్టి ప్రభుత్వానికి నివేదించడమే పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కర్తవ్యం. కానీ ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లాంటి ఆ విభాగానికి చెందిన సదరు అధికారి మాత్రం ఇందుకు విరుద్ధంగా తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నాడు.
అధికార టీడీపీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యేకు రహస్య సమాచారం చేరవేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఆరోపణలు, వివాదాల్లో నిండా మునిగిన ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా అందిన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపకుండా తొక్కిపెడుతున్నాడు.
విశాఖపట్నం: జిల్లాలో ఇటీవలి కాలంలో లెక్కకు మించిన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి నిఘా(ఇంటెలిజెన్స్) విభాగంలోని ఓ అధికారి కొమ్ముకాస్తున్నాడని తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నివేదికలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ సదరు నేత సేవలో తరిస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఆ ఎమ్మెల్యేపై ఇటీవలి కాలంలో ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఈ మధ్యే పుట్టిన రోజు చేసుకున్న ఆ ప్రజాప్రతినిధి వేడుకల పేరిట భారీస్థాయిలో కలెక్షన్లు చేశారు. చివరికి అంగన్‌వాడీ కార్యకర్తలను కూడా వదలకుండా చేసిన వసూళ్ల వేడుకలు ప్రజల్లో ఆ నేతను మరింత అభాసుపాల్జేశాయి. అంతే.. వెంటనే రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారి ఆ నేతను అప్రమత్తం చేశారు. ఫోన్ చేసి.. ‘పుట్టినరోజు సంబరాలు మిమ్మల్ని బాగా పలుచన చేశాయి.. జాగ్రత్తగా ఉండండి.. ఈ విషయమై నేను ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వను.. కానీ కొద్దిరోజులు మీరు హడావుడి చేయకుండా తెరవెనక్కి వెళ్లిపోండి’.. అని సూచనలు చేశారు. దీంతో ఆ నేత నియోజకవర్గం దాటి వెళ్లిపోయి.. అంతా సద్దుమణిగిన పదిరోజుల తర్వాత తిరిగి వచ్చారు.
సర్వేనూ తొక్కిపెట్టేశారట?
టీడీపీ అధినేత, సీఏం చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో వేగుల ద్వారా ప్రజాప్రతినిధుల పనితీరుపై పక్కాగా సర్వే చేయించారు. ప్రతి ఆర్నెల్లకోసారి చేస్తున్న సర్వే మాదిరి కాకుండా ఈసారి కేవలం ప్రజాప్రతినిధుల పనితీరుపైనే సర్వే చేశారు. టీడీపీ రెండేళ్ల పాలన, జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులందరిపైనా వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రత్యేకించి విపరీతమైన అవినీతి ఆరోపణలతో అంటకాగుతున్న ఆ నేతపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇదే విషయాన్ని ఆ ఇంటెలిజెన్స్ అధికారి సదరు నేతకు చేరవేశారు. జిల్లాలో మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. కోలుకోలేని విధంగా ఉంది.. అని ఉప్పందించారు. ఇలా ప్రజాప్రతినిధులకు ఇంటెలిజెన్స్ అధికారులు లోపాయికారీగా ఉప్పందించడం సాధారణమే అయినా.. ఈ అధికారి ఓ అడుగు ముందుకేసి.. మీపై నెగటివ్ రిపోర్టులేమీ ప్రభుత్వానికి ఇవ్వకుండా తొక్కిపెట్టేస్తున్నానని భరోసా ఇవ్వడమే వివాదాస్పదమవుతోంది.
ఆ అధికారి ఉండగా.. ఏం కాదట!
ఇక ఇంటెలిజెన్స్ అధికారి ప్రతి విషయాన్ని తనకు చేరవేస్తున్నారని ఆ నేత బహిరంగంగానే పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఇటీవల వెలుగుచూసిన భూదందాలు, సెటిల్‌మెంట్ల విషయమై ఆ నేత క్యాడర్‌తో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్‌లో మనోళ్లు ఉన్నారు.. మన కేం ప్రాబ్లమ్ లేదు.. నెగటివ్ రిపోర్టులేమీ ప్రభుత్వానికి పంపించరు.. పత్రికల్లో ఏమొచ్చినా క్లిప్పింగ్‌లు వెళ్లవు.. అన్నీ ఇక్కడే ఆగిపోతాయి.. విజయవాడ, హైదరాబాద్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు.. ఏమైనా వెళ్లినా.. మన గురించి పాజిటివ్ రిపోర్టులే వెళ్తాయి.. అని ధీమాగా చెప్పుకొచ్చారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అసలు.. ఎందుకు ఆ అధికారి సదరు ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు.. ఏం ఆశించి ఆ విధంగా వ్యవహరిస్తున్నారు.. సామాజికవర్గ కోణమా.. వ్యక్తిగత అభిమానమా.. అనేది ఇంటెలిజెన్స్ వర్గాల్లోనే చర్చకు తెరలేపింది.