– మోడల్ స్కూళ్ల దుస్థితి
– ఆ వైపునకు రాని ఇంటర్ విద్యార్థులు
– రెండేళ్లుగా ఇదే పరిస్థితి
– సుదూరంలో స్కూళ్లు
– బోధనా సిబ్బంది కొరత
ఆళ్లగడ్డ:
కార్పొరేట్‌కు దీటుగా గ్రామీణ పేద విద్యార్థులకు సైతం అన్ని వసతులతో కూడిన ఆంగ్ల మీడియం విద్యను అందించేందుకు ఉద్దేశించిన మోడల్ స్కూళ్లు పదోతరగతి వరకే పరిమితమవుతున్నాయి. పదో తరగతి వరకు సీట్లు భర్తీ అవుతున్నా ఇంటర్‌కు వచ్చే సరికి విద్యార్థులంతా ఇతర కాలేజీలవైపు వెళ్తున్నారు. ఫలితంగా ఇంటర్ విద్యార్థులు లేక మోడల్ స్కూళ్లు వెలవెలబోతున్నాయి.
పది వరకు పర్వాలేదు..
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో సీటు కోసం పోటీ అధికంగా ఉంటోంది. 75 మార్కులు దాటితే తప్ప సీటు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధ్యాపకులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు, భూస్వాములు సైతం ప్రయివేటు పాఠశాలలను కాదని తమ పిల్లలను మోడల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు.
ఇంటర్‌కు ఆదరణ కరువు
పది వరకు ఇంత ప్రాధాన్యం ఉన్న మోడల్ స్కూళ్లకు ఇంటర్ మీడియట్‌కు వచ్చే సరికి ఆదరణ కరువైంది. పది వరకు ఇక్కడే చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం ఇంటర్ మీడియట్‌ను అక్కడే చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లుగా ఆయా స్కూళ్లలో ఇంటర్ విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు దాటకపోవడం ఇందుకు నిదర్శనం. రుద్రవరం మోడల్ స్కూల్లో ఇంటర్‌కు ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం గమనార్హం. అన్ని పాఠశాలల్లో నాలుగు గ్రూపులకు కలిపి 20 సీట్ల ప్రకారం 80 సీట్లు ఉన్నాయి. ఇలా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలను తీసుకుంటే 160 సీట్లు అందుబాటులో ఉండగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఏ మోడల్ స్కూలు చూసినా ఇంటర్ విద్యార్థుల సంఖ్య 30 మందికి మించడం లేదు.
ఎంపీసీ, బైపీసీకే పరిమితం
ఇంటర్ మీడియట్ విషయానికొచ్చేసరికి పాఠశాలల్లో బోధనా సిబ్బంది సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఇటువైపు వచ్చేందుకు విద్యార్థులు సంకోచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులుండగా దాదాపు అన్ని స్కూళ్లలో అధ్యాపకుల కొరత కారణంగా ఎంపీసీ, బైపీసీ మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో మిగతా గ్రూపులపై ఆసక్తి ఉన్న వారు దూరమవుతున్నారు.
వర్షం వస్తే నడవలేం: విష్ణువర్ధన్, జూనియర్ ఇంటర్
పొలాల్లో స్కూలు బిల్డింగ్ కట్టించారు. రోడ్డు వేయకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా దారి బురదగా మారుతోంది. దీంతో ఇబ్బంది పడుతున్నాం.
బాడుగ ఇంట్లో ఉంటున్నాం: శిరీష, సీనియర్ ఇంటర్
మాది అహోబిలం. హాస్టల్ ఉంటుందని సారోళ్లు చెబితే ఇంటర్‌కు ఇక్కడే చేరాను. సంవత్సమైనా హాస్టల్ తెరవలేదు. రోజూ ఊరు నుంచి వచ్చేందుకు వేళకు బస్సులు లేకపోవడంతో అమ్మతో కలిసి ఇక్కడే ఇళ్లు బాడుగకు తీసుకుని ఉంటున్నాం.
రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే ఫలితం ఉంటుంది: డాక్టర్ మహమ్మద్‌ఇష్మాయిల్, రుద్రవరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
అనేక స్కూళ్లలో బోధనకు కాంట్రాక్టు సిబ్బందే దిక్కయ్యారు. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమిస్తే విద్యార్థులను ఇంటర్‌కు ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు.
హాస్టల్ ఏర్పాటు చేయాలి: ఇప్తెకార్‌హుస్సేన్, ఆళ్లగడ్డ ప్రిన్సిపాల్
బాలికలను బస్సులు, ఆటోల్లో పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. హాస్టల్ ప్రారంభించి వసతి కల్పిస్తే ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడే 10 వరకు చదువుకున్న బాలికలందరూ ఇంటర్‌లో చేరే అవకాశం ఉంది.
పాఠశాలల్లో ఉండాల్సిన సిబ్బంది, విద్యార్థుల వివరాలు..
మండలం – ఉండాల్సిన అధ్యాపకులు– ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు – పార్ట్‌టైం టీచర్లు – 5 నుంచి 10 వరకు విద్యార్థులు – ఇంటర్
రుద్రవరం – 21– 6 – 7 – 30 – 0 – 0
ఆళ్లగడ్డ – 21 – 7 – 10 – 350 – 24 – 6
ఉయ్యలవాడ– 21 – 6 – 11 – 380 – 30 – 12