అనంతపురం: అనంతపురంలోని గుత్తి రోడ్డులోని ఇంటర్ పరీక్ష కేంద్రానికి వెళ్లిన అమ్మాయి అదృశ్యమైంది. అయితే ఆ విద్యార్థిని హాల్‌టికెట్ గుంతకల్లు రైల్వే ప్లాట్‌ఫారంపై లభించడం కలకలం రేపుతోంది. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లికి చెందిన రాజన్న కూతురు గీత అనంతపురం శారదనగర్‌లోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఫెయిల్ కావడంతో ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు రాస్తోంది.
గతంలో చదివిన కళాశాలలోనే ప్రస్తుతం ఉంటోంది. బుధవారం ఉదయం పరీక్ష కేంద్రానికి ఆటోలో వెళ్లింది. పరీక్ష ముగిసిన తర్వాత తనకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తానని చెప్పిన ఆటోడ్రైవర్ తన సెల్ నంబర్ ఇచ్చాడు. పుస్తకం వెనుకవైపు నంబర్ రాసుకుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు ఆటో డ్రైవర్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. ‘గీత అనే అమ్మాయి హాల్ టికెట్, ఓ పుస్తకం గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పడి ఉన్నాయని’ చెప్పారు. ఉదయం పరీక్ష కేంద్రం వద్ద వదిలిపెట్టిన అమ్మాయి గుంతకల్లుకు ఎలా వెళ్లిందని కంగారుపడ్డ ఆటో డ్రైవరు నేరుగా కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్ సంజీవప్రసాద్‌కు విషయం చెప్పాడు.
ఆయన తిరిగి గుంతకల్లు నుంచి వచ్చిన సెల్‌నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు కనుగొన్నారు. విద్యార్థిని అదృశ్యమైందని భావించి నేరుగా అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉదయం పరీక్ష కేంద్రం వద్ద ఆటో డ్రైవర్ వదిలిపెట్టిన తర్వాత గుంతకల్లుకు ఎలా వెళ్లింది, ఎవరైనా మాయమాటలు చెప్పి పిల్చుకెళ్లారా? స్నేహితురాళ్లతో కలసి వెళ్లిందా, లేక ఇతర బలమైన కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. గీత తల్లిదండ్రులు ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లారని సీఐ రాఘవన్ తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని అదృశ్యంపై కలకలం
Published Thu, May 26 2016 9:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement