ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో అక్రమాలు
ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో అక్రమాలు
Published Sat, Oct 1 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహ
కర్నూలు(హాస్పిటల్): ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ ఆరోపించారు. శనివారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని విద్యార్థి సమాఖ్య కార్యాలయంలో మెడికల్ సీట్లు రాని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఏ మాత్రం పాటించలేదన్నారు. ఓపెన్ కేటగిరిలో వెళ్లాల్సిన విద్యార్థులను రిజర్వేషన్ సీట్లలో భర్తీ చేశారన్నారు. దీంతో 200కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ అగ్రవర్ణాల విద్యార్థులున్నట్లుగా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఓసీ కట్ ఆఫ్ ర్యాంకు 2,283వ ర్యాంకు రాగా, రెండో కౌన్సెలింగ్‌లో ఓసీ కట్ ఆఫ్ ర్యాంకు 3,207 ర్యాంకుగా ఉందన్నారు. రెండో కౌన్సెలింగ్ వచ్చే సమయానికి రాష్ట్రంలో 900 సీట్లు పెరిగాయని, కానీ అధికారులు పెరిగిన సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించకుండా మూకుమ్మడిగా చేపట్టారన్నారు. ఇందులో దాదాపు రూ.500కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. గతంలో ఎన్.జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇదే విధంగా అక్రమాలు జరిగాయన్నారు. బీసీ విద్యార్థులైన బి.తేజస్విని (5,242) శ్రీ లత (6,072), కౌసర్ మొయిద్‌కు (5,154), నిఖిల్‌సాగర్ (5,844) ర్యాంకు వచ్చినా సీట్లు రాలేదన్నారు. గతంలో సీట్లు తక్కువ ఉన్నా ఈ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయని, ఇప్పుడు సీట్లు పెరిగినా రాకపోవడం దారుణమన్నారు. వెంటనే కౌన్సిలింగ్‌ను రద్దు చేసి తిరిగి సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement