ఇరిగేషన్ అధికారుల నిర్బంధం
ఇరిగేషన్ అధికారుల నిర్బంధం
Published Wed, Nov 9 2016 9:14 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
బండారుపల్లి (తాడికొండ రూరల్): ఎండిపోతున్న మిరప పంటలకు సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు ఇరిగేషన్ అధికారులను నిర్బంధించిన ఘటన బండారుపల్లి మేజర్‌పై బుధవారం జరిగింది. అరకొరగా సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేసిన అధికారులు ఉదయం పర్యవేక్షణ పేరుతో బండారుపల్లి మేజర్ వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు హుటాహుటిన అక్కడకు వచ్చి ఎస్‌ఈ రాంప్రసాద్‌ను చుట్టుముట్టారు. చివరి భూములకు సరిపడా నీటిని విడుదల చేయాలని ఆందోళన చేశారు. ఎంత సేపటికీ వదలకపోవడంతో అధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మంత్రి దేవినేని ఉమా, ఇరిగేషన్ సీఈ వీర్రాజులతో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో చివరి ఎకరం తడిసే వరకు తానే దగ్గరుండి నీటిని విడుదల చేయిస్తానని సీఈ వీర్రాజు హామీ ఇచ్చారు. అలాగే, ఈ ఆందోళనలో జెడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, టీడీపీ నాయకులు మానుకొండ శివరామకృష్ణ, రత్తయ్య, గుంటుపల్లి మధుసూధనరావు, పొన్నెకల్లు, రావెల, మందపాడు, మేడికొండూరు, బేజాత్పురం తదితర గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
Advertisement