ఆ బాధ నాకుతెలుసు....
-
–అండగా మేమున్నాంటూ జగన్ బరోసా
-
–నమ్మి చిన్నారావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
ఎన్‌ఏడీ జంక్షన్ (విశాఖ): ఇంటి పెద్ద గల్లంతయిన బాధ తాను అనుభవించానని ఆ బాధ నాకు తెలుసని నమ్మి పైడితల్లమ్మతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఇటీవల ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతయిన సంఘటనలో బుచ్చిరాజుపాలెం నమ్మి చిన్నారావు కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. చిన్నారావు భార్య నమ్మి పైడి తల్లమ్మ చేతులుపట్టుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరితో మాట్లాడారు. తన తండ్రి కూడా ఇలాగే గల్లంతయ్యారని రెండు రోజులు మాకుటుంబం అనుభవించిన బాధ తనకు తెలుసని అన్నారు. చిన్నారావు తిరిగి రావాలని కోరుకుంటున్నానన్నారు. మీరంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. విమానం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని అన్నారు. అలాగే మీ కుటుంబాన్ని ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని బరోసా ఇచ్చారు. పైడి తల్లమ్మతో కొడుకులు, కూతురు గురించి ఆరా తీశారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి చదువు విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మీకు ఏ రకమైన అవసరమొచ్చినా మా నాయకులకు తెలియ జేయాలని వారి ఫోన్ నంబర్లు రాసి ఇచ్చారు. మీకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ, 67వ వార్డు అధ్యక్షుడు చుక్క ప్రసాదరెడ్డి, వార్డు కార్యదర్శి దొడ్డి సతీష్, నగర మహిళా అధ్యక్షురాలు పుసుపులేటి ఉషాకిరణ్, నగర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ, తదితరులు పాల్గొన్నారు.