
గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్ సీపీ నేతలు
హైదరాబాద్: విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శోభానాగిరెడ్డి, రెహ్మాన్ పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తామని వైఎస్సార్ సీపీ నేతలు హామీయిచ్చారు.
మసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. శ్రీహరి అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలాన్ని మేయర్ మాజిద్ హుస్సేన్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ తరపున లక్ష రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్టు మేయర్ ప్రకటించారు.