వైభవంగా.. జగన్నాథ రథోత్సవం
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన జగన్నాథ రథయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఇస్కాన్ కార్యకర్తలు, భక్తులతో ‘అనంత’ జనసంద్రంగా మారింది. ఇస్కాన్ 9వ వార్షికోత్సవంలో భాగంగా సాగిన రథయాత్రలో వందలాది మంది భక్తులు విష్ణుసహస్రనామ జపం, హరేరామ హరే కృష్ణ అంటూ ఇస్కాన్ కార్యకర్తల నామస్మరణతో నగర పురవీధులు మార్మోగాయి. స్థానిక కేఎస్‌ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిtరంగ సభా వేదిక నుంచి 108 పవిత్ర కళశాలతో జగన్నాథుడి రథయాత్ర బయలుదేరి, సప్తగిరి సర్కిల్, సుభాష్ రోడ్, టవర్‌క్లాక్, ఆర్ట్స్ కళాశాల మైదానం, శ్రీకంఠం సర్కిల్, తాడిపత్రి బస్టాండు, పాతూరు వీధుల మీదుగా కళాశాల ప్రాంగణం చేరుకుంది.
రథానికి నగరవాసులు అడుగుడుగునా కర్పూర హారతులు ఇచ్చారు. జిల్లాలోని పలు ఆధ్యాత్మిక సంస్థలే కాకుండా అధికార, అనధికారులు రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు. రథయాత్రను జిల్లా ఎస్పీ ఎస్‌వీ రాజశేఖరబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. దక్షిణభారత దేశ ఇస్కాన్ మందిరాల అధ్యక్షుడు సత్య గోపీనాథ్ స్వామీజీ ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. మూడోసారి అనంత వేదికగా జగన్నాథ రథయాత్ర సాగినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 108 పవిత్ర నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు, రాజమండ్రి తదితర ఇస్కాన్ మందిరాల నుంచి విచ్చేసిన నిర్వాహకులు, ఇస్కాన్ స్థలదాత డా.కేశన్న, స్థానిక టీటీడీ ధార్మిక మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు, ఫ్లెక్స్ రమణ, ఇంటెల్ ప్రతాపరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి తదితరులు రథయాత్రలో పాల్గొన్నారు.