‘జన’తరంగిణి
‘జన’తరంగిణి
Published Sun, Aug 21 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
· అన్ని పుష్కరఘాట్లలో భక్తుల సందడి
· సంగమేశ్వరం, నెహ్రూనగర్‌లో కొనసాగిన రద్దీ
· శనివారం జిల్లా వ్యాప్తంగా 1,28,205 భక్తుల పుష్కర స్నానాలు
శ్రీశైలం :
కృష్ణవేణీ నమస్తుభ్యం సర్వపాపప్రక్షాళిని !
త్రిలోకే పావన జలే రంగత్తుంగ తరంగిణి !!
అంటూ సకల పాపాలను హరించి ముల్లోకాలను పావనం చేసే జలాలను కలిగి అందమైన అలలతో నాట్యమాడే కష్ణవేణీమాతకు నమస్కారం చేస్తూ భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో శనివారం పుష్కర స్నానాలను చేసుకున్నారు. పుష్కరాల్లో తొమ్మిదో రోజు శనివారం.. అన్ని పుష్కర ఘాట్లలో భక్తి రద్దీ కనిపించింది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ తదితర అన్ని ఘాట్లు భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. వేకువజామున 4గంటల తరువాత ప్రారంభమైన భక్తులరద్దీ మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మందగించింది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది భక్తులు మధ్యాహ్నం 12గంటల్లోగానే పుష్కర స్నానాలు ముగించుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట తరువాత అన్ని ఘాట్ల వద్ద రద్దీ తగ్గి ఆ తరువాత సాయంత్రం వేళ 5.30గంటల నుంచి 7గంటల వరకు సాధారణస్థాయిలో ఉంటుంది. శ్రీశైలంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, ఆర్డీఓ రఘుబాబులు పాతాళగంS, లింగాలగట్టుఘాట్లను సందర్శించి ఏర్పాట్లను. లింగాలగట్టు వద్ద యర్రగొండపాలెం ఎంఎల్‌ఏ డేవిడ్ రాజు పుష్కరస్నానాలు ఆచరించుకున్నారు. శనివారం రాత్రి 8గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 1,28,205 మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించుకున్నట్లు అధికారుల అంచనా.
రెండుగంటల పాటు భ్రమరాంబ ఘాట్ మూసివేత
పాతాళగంగ వద్ద కొత్తగా నిర్మించిన భ్రమరాంబ పుష్కర ఘాట్‌ను సుమారు రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశాల మేరకు మూసివేశారు. శుక్రవారం రాత్రి ఆ ఘాట్‌కు సమీపంలో ఉన్న కొండ చరియల నుంచి రాళ్లు జారిపడడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో విరిగిపడ్డ కొండచరియల రాళ్లు తిరిగి పడకుండా ఐరన్ మెష్‌ఏర్పాటు చేసి హైటెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ ద్వారా దిగ్బంధం చేసే ప్రక్రియ సగం వరకు కొనసాగింది. ఆ మిగిలిన సగం భాగం నుంచే రాళ్లు పడడంతో రెండు గంటల పాటు ఘాట్ మూసివే సి పూర్తిస్థాయిలో కొండ చర్యలు విరిగిపడకుండా హైటెన్షన్ వైర్లను వినియోగించి మిగిలిన పని పూర్తి చేశాక తిరిగి భక్తులను ఆ మార్గం ద్వారా అనుమతించారు. దీంతో మల్లికార్జునఘాట్‌కు భక్తుల తాకిడి పెరిగింది. అయితే అక్కడి నుంచి పిండప్రదానం మార్గం ద్వారా భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సివచ్చింది. మొదట నాపరాళ్లు వేసి ఆ తరువాత వెట్‌మిక్స్‌ర్ వేసి మళ్లీ అది గుంతలు పడడంతో తిరిగి దానిపై నాపరాళ్లను వేయడం ప్రారంభించారు. దీంతో భక్తులు బ్రమరాంబా ఘాట్ నుంచి పిండప్రదానం స్టేజీ మీదుగా వెళ్లడానికి నానా కష్టాలు పడ్డారు.
Advertisement
Advertisement