ప్రశ్నల వర్షం | janma bhumi meetings details | Sakshi
Sakshi News home page

ప్రశ్నల వర్షం

Published Sat, Jan 7 2017 12:12 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

janma bhumi meetings details

- సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్న జనం
- నీటి కోసం ప్రభుత్వవిప్‌ను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు


అనంతపురం అర్బన్‌ : ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమం జిల్లాలో మొక్కుబడి తంతుగా సాగుతోంది. సమస్యలపై సభల్లో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా జరిగిన జన్మభూమి సభల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి కొనసాగింది.
- శింగనమల మండలం చాలవేములలో జన్మభూమి కార్యక్రమానికి ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్‌ఏ యామినీబాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం కాగానే ఓబులాపురం టీడీపీ కార్యకర్తలు, రైతులు 29వ డిస్ట్రిబ్యూటరీకి హెచ్‌ఎల్‌సీ నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే టీడీపీ నేతలు దానికి అడ్డుతగలడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు పోలీసులు నచ్చచెప్పారు. నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
- గుంతకల్లు మునిసిపాలిటీలోని వార్డుల్లో నిర్వహించిన జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. మండలంలోని వెంకటాంపల్లిలో సమస్యలపై చుట్టుముట్టిన ప్రజలకు సమాధానం చెప్పక అధికారులు నీళ్లునమిలారు. ఉన్నఫలంగా సభలను ముగించి  వెళ్లిపోయారు.  పామిడి, గుత్తి మండలాల్లోనూ జన్మభూమి సభలు మొక్కబడిగా సాగాయి.
- అర్హులైన వారికి పింఛన్ల తొలగించారంటూ బ్రహ్మసముద్రం మండలం  బైరానితిప్పలో జరిగిన జన్మభూమి గ్రామసభను వైఎస్సార్‌సీపీ నాయకులు , కార్యకర్తలు అడ్డుకున్నారు.
- సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను మడకశిర, కందిరేపల్లి, మెళవాయిలో జన్మభూమి గ్రామసభల్లో ప్రజలు నిరసన తెలిపారు.
- అర్హులైన తమకు  పింఛన్లు ఇవ్వాలంటూ కణేకల్‌ మండలం రచ్చుమర్రి జన్మభూమిలో అధికారులను ప్రజలు నిలదీశారు.

వృద్ధురాలికి అస్వస్థత
ఓడీ చెరువు : జన్మభూమి గ్రామసభకు హాజరైతేనే పింఛన్‌ ఇస్తామన్న పాలకుల హుకుం ఓ వృద్ధురాలిని అస్వస్థతకు గురించేసింది.  ఓడీ చెరువు మండలంలోని పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు సంజీవమ్మకు రెండు నెలలగా పింఛన్‌ రాలేదు.  జన్మభూమి కార్యక్రమానికి హాజరైతేనే పింఛన్‌ ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆమె సున్నంపల్లికి వచ్చింది. ఎంత సేపటికీ పింఛన్‌ ఇవ్వకపోవడంతో కార్యక్రమంలోనే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెకు అక్కడే వైద్య శిబిరంలో చికిత్సలు చేయించిన అనంతరం పింఛన్‌ అందించారు.

ఎంపీడీఓకు వేదిక పై చోటు లేదా?
నల్లచెరువు: మండల పరిధిలోని కె పూలకుంటలో శుక్రవారం జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో వేదికపైన కూర్చోడానికి ఎంపీడీఓ మగ్బుల్‌బాషాకు చోటులేదా అని వచ్చిన ప్రజలు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌లు హాజరయ్యారు. కాగా వేదిక పై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సైతం వేదికపై కూర్చోవడంతో ఎంపీడీఓకు చోటు లేకపోవడంతో సమావేశం ముగిసే వరకు అలానే ఓ చివరన నిలబడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement