ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్
- అలా ఉంది సీఎం నిర్వాకం
- చంద్రబాబుపై జయప్రకాశ్‌నారాయణ్ ధ్వజం
విజయవాడ(గాంధీనగర్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాకం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. రాజధాని శంకుస్థాపన విషయంలో డబ్బును లెక్క చేయకుండా గొప్ప వేడుక నిర్వహించామన్న సంతృప్తే మిగిలింది తప్ప, ఫలితం రాలేదని, శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రిని ఏం కావాలో కోరకుండా 'సార్ సార్ మీ దయ మా ప్రాప్తం' అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు.
చంద్రబాబు ఈవెంట్ మేనేజర్‌లా కాకుండా, ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఇకనైనా డ్రామాలు మానాలని, ప్రజాధనంతో ఆర్భాటాలు తగవని, వినోదాలు, విలాసాలు పక్కన పెట్టాలని హితవు పలికారు. రాష్ట్రంలో లక్షలకోట్ల ప్రజాధనం మూలుగుతున్నట్లు.. వేడుకకు పదుల కోట్లు, క్యాంప్ ఆఫీసుకు రూ.10 కోట్లు, విమానాలకు వందల కోట్లు ఖర్చు చేయడమేమిటని ఆయన నిలదీశారు.
లోక్‌సత్తా పార్టీ సమావేశం ఆదివారం విజయవాడ రోటరీ చిల్డ్రన్స్ ట్రస్ట్ భవన్‌లో జరిగింది. సమావేశానంతరం జేపీ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంటే మంత్రులు, అధికారులకు రూ.40 లక్షలు, 50 లక్షల విలువ చేసే ఏసీ కార్లు అవసరమా? అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన నాటినుంచి కొంతకాలం పుష్కరాలు, అధికారుల విభజన, పట్టిసీమ, అమరావతి శంకుస్థాపన సంరంభాలు అంటూ కాలం వెళ్లదీశారని విమర్శించారు.