సమస్యలపై జర్నలిస్టుల ఆందోళన బాట
ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
జర్నలిస్టుల సమస్యలపై ఆందోళనబాట పట్టేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజెఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వం అందించే హెల్త్ కార్డులపై వైద్యం అందేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి, అక్రిడియేషన్లు, జర్నలిస్టుల పిల్లలకు విద్యా రాయితీల అమలు వంటి సమస్యలపై ఆందోళన చేయనున్నట్టు స్పష్టం చేసింది. స్థానిక జగదీశ్వరి హోటల్‌లో గురువారం ఏపీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన హెల్త్ కార్డులపై ప్రయివేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం అందడం లేదని, దీనివల్ల చాలా మంది జర్నలిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులపై వైద్యం అందించే విషయంలో ఎదరవుతున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వివిధ స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టినట్టు వివరించారు. ఆ ఆందోళనను మరింత ఉధృతం చేసి, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు, కార్పొరేట్ విద్య సంస్థల్లో ఫీజు రాయితీకి సంబంధించి డీఈవోల నుంచి లేఖలు కాకుండా రాష్ట్రస్థాయిలో ఒకపాలసీ అమలు చేసే విధంగా జీవో తీసుకువచ్చేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కె పరమేశ్వరరావు కోశాధికారి శాంతి, బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్సు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి ప్రియచౌదరి, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఎడిటర్ కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ మంజరి,ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నవీన్‌రాజ్, సభ్యులు డీఎ లింకన్, రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ స్వామినాయుడు, ఎన్ శ్రీనివాస్, సభ్యులు నాని, వెంకటేష్, వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు.