ఆకలి మంటలు | jute labour problems | Sakshi
Sakshi News home page

ఆకలి మంటలు

Published Wed, Sep 7 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

మూతపడిన ఈస్ట్‌కోస్ట్‌ జూట్‌ మిల్లు

మూతపడిన ఈస్ట్‌కోస్ట్‌ జూట్‌ మిల్లు

ఆకలితో జూట్‌ కార్మికుల ఆవేదన
 స్పందించని యాజమాన్యాలు
 సంఘాల పోరాటానికి కానరాని స్పందన
 కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని వినతి
 
 
విజయనగరం టౌన్‌ : జిల్లాలో జూట్‌ పరిశ్రమ మూడు పువ్వులు... ఆరుకాయలుగా ఎదగడానికి ప్రధాన పాత్ర పోషించింది కార్మికులే. వారు చిందించిన స్వేదం యాజమాన్యాలకు కాసులు కురిపించాయి. వారి శ్రమ పరిశ్రమకు ఊతమయ్యింది. కానీ నిర్వహణా భారం పేరుతో ఆదుకున్న కార్మికులను నడిరోడ్డుకు విసిరేసినా... వారికి రావాల్సిన బకాయిలు యాజమాన్యాలు చెల్లించకపోయినా... అన్నమో రామచంద్రా అని ఆకలితో అలమటిస్తున్నా... సర్కారుకు పట్టకపోవడం వారి దౌర్భాగ్యం. జిల్లా కేంద్రంలో ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ జూట్‌ మిల్లులో మూడువేల మంది కార్మికులు దాదాపు రెండేళ్లుగా పనుల్లేక... వారికి రావాల్సిన జీతభత్యాలు, పీఎఫ్, ఈఎస్‌ఐలు లేక... పనులు దొరక్క అవస్థలు పడుతున్నారు. అరుణా జూట్‌ మిల్లు పరిస్థితి మరీ దారుణం. కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీలు చెల్లించకుండా యాజమాన్యం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోంది. మిల్లు మూసేసినా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. నిన్న మొన్నటి వరకూ ఏదో ఒక్క యూనియన్‌ మాత్రమే కార్మికులకు అండగా నిలబడేది. పరిస్థితి దయనీయంగా మారడంతో కార్మిక సంఘాలన్నీ కలిసి ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్‌కు జిల్లాలోని వివిధ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు వినతినిచ్చాయి.
 
 
ప్రధాన ఉపాధి జూట్‌ పరిశ్రమే!
జిల్లాలో జూట్‌ పరిశ్రమే నేటికీ ప్రధాన ఉపాధి కేంద్రం. తర్వాతిస్థానం ఫెర్రో ఎల్లాయిస్‌దే. జిల్లాలో ఉన్న 11 జూట్‌ మిల్లులో ఇప్పటికే పది మూతపడ్డాయి. దీనివల్ల సుమారు 16వేల మంది ప్రత్యక్షంగా, ఐదు వేల మంది పరోక్షంగా ఆధారపడ్డాయి వారంతా నేడు రోడ్డున పడ్డారు. జిల్లాలో 12 ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు మూతపడి మరో 7600 మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. 
 
జూట్‌ మిల్లులు మూతపడిన తేదీలు
ఈస్ట్‌కోస్ట్‌  జూట్‌ మిల్లు 2014 మే 31నుంచి
 బొబ్బిలి జూట్‌ మిల్లు 2015 జనవరి 19 నుంచి
అరుణా జూట్‌ మిల్లు 2015 నవంబరు 2నుంచి
కొత్తవలసలో మూడు మిల్లులు 2016 పిబ్రవరి 8 నుంచి
సాలూరు ఏపీ ఫైబర్స్‌ జూట్‌ మిల్లు 2016 పిబ్రవరి 29 నుంచి
వీటితో పాటూ జ్యోతి, నవ్య, గ్రోత్‌ సెంటర్‌ (బొబ్బిలి పరిధిలో) ఉన్న మిల్లులు లాకౌట్‌లలో ఉన్నాయి. 
 
 
ప్రధాన డిమాండ్లు :
– జిల్లాలో మూతపడిన జూట్, ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమల్ని తెరిపించాలి.
– శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్‌ మిల్లుల కేసుల పరిష్కారానికి బీఐఎఫ్‌ఆర్, హైకోర్టు , లేబరుకోర్టు, జిల్లా కోర్టుల్లో కార్మికుల తరఫున న్యాయవాదులను ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి.
– కొత్తవలస జూట్‌ కార్మికులు పనిచేసిన కాలానికి జీతాలిప్పించాలి.
– నెల్లిమర్ల జూట్‌ మిల్లులో రిటైర్‌ అయిన సుమారు 700 మంది కార్మికుల గ్రాట్యుటీ, పీఎఫ్‌ చెల్లించాలి.
– నెల్లిమర్లలో హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులను ఉల్లంఘించిన యాజమాన్యంపై తగు చర్యలుతీసుకోవాలి. ప్రభుత్వ ఆటస్థలంలో యాజమాన్యం ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించాలి.
– కార్మిక ప్రయోజనాలను కాపాడే, వాస్తవంగా నష్టపోయిన యాజమాన్యాలకు మాత్రమే ప్రభుత్వ రాయితీలు కల్పించాలి.
– జూట్‌ పరిశ్రమ పరిరక్షణకై యజమానులు, యూనియన్లు, లేబరు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలి.
 
 
కార్మికులకు భరోసా అవసరం - కె.సన్యాసిరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
మేమున్నామంటా కార్మికులకు భరోసా కల్పించాలి. మూతపడిన మిల్లులు తెరిపించాలి. రావాల్సిన బకాయిల్ని త్వరితగతిన వచ్చేలా చూడాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. వేలాది మంది కార్మికులు పొట్ట కొడితే రాబోయే రోజుల్లో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
 
 
జూట్‌ పరిశ్రమను ఆదుకోవాలి––బెహరా శంకరరావు, అరుణామిల్లు గుర్తింపు సంఘం ఏఐఎఫ్‌టీయూ(న్యూ) నాయకుడు
పరిశ్రమలకు ప్రభుత్వం కొంతమేర చేయూతనివ్వాలి. ఆర్ధికంగా ఆదుకోవాలి. అదేవిధంగా కార్మిక హక్కులను కాలరాస్తున్న యాజమాన్యాలపై కొరడా ఝుళిపించి కఠిన చర్యలు చేపట్టాలి. కొన్ని పరిశ్రమలు తప్పుడు సమాచారంతో కోర్టుల నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్లు తీసుకువస్తున్నాయి. వాటిపై ప్రభుత్వ లాయరును పెట్టి నిజనిర్ధారణ చేయించాలి. జూట్‌ కార్మికులను ఆదుకోవాలి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement