ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
Published Thu, Jan 19 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
నరసాపురం : జాతీయస్థాయి పురుషుల కబడ్డీ పోటీల విజేతగా విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు, మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు చాంపియన్లుగా నిలిచాయి. నరసాపురం రుస్తుంబాధలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌ల్లో పురుషుల విభాగంలో విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు 28–16 స్కోర్ తేడాతో బాబా హరిదాస్ హర్యానా జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు 27–25 పాయింట్ల తేడాతో గురుకుల్ హర్యానా(ఏ) జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. తొలుత మూడు, నాలుగు స్థానాల కోసం కూడా పోటీ తీవ్రంగా సాగింది. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం ఆంధ్రా, పోస్టల్ కర్నాటక మధ్య పోటీ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 2 పాయింట్ల తేడాతో ఆంధ్రా జట్టు గెలిచి మూడోస్థానంలో నిలిచింది. పోస్టల్ కర్నాటక జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో హర్యానా(బి), దిండిగళ్ చెన్నై జట్లు నిలిచాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్యానా(బి) జట్టు 8 ఫాయింట్ల తేడాతో దిండిగళ్ చెన్నై జట్టును ఓడించింది. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో పురుషుల విజేత జట్టుకు రూ.1 లక్ష నగదు, రెండోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు, నాలుగోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు, షీల్డులు అందించారు. మహిళా విభాగంలో గెలుపొందిన జట్లకు కూడా ఇదేరకంగా బహుమతులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వీర్లవెంకయ్య, జిల్లా కార్యదర్శి ఎం.రంగారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement