- హాజరుకానున్న 13 జిల్లాల ప్రతినిధులు
- రెండో దఫా హైదరాబాద్‌లో సమావేశం: జేఏసీ నేతలు
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా)
కాపులను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ గడువు ఆగస్టు 30తో ముగిసినా ఇప్పటి వరకు కమిషన్ నివేదిక ఇవ్వలేదని కాపు రిజర్వేషన్ల ఐక్య కార్యాచరణ సమితి నేతలు మండిపడ్డారు. తొమ్మిది నెలల సమయంలో ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ కమిషన్ పర్యటించలేదని, ముద్రగడ పద్మనాభం దీక్ష సమయంలో టీడీపీ మంత్రులు, నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 11న ఉదయం తొమ్మిది గంటలకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బార్లపూడి కల్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి 13 జిల్లాల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రతినిధులు హాజరవుతున్నారని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్టుమూర్తి తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. సమావేశంలో ఇప్పటి వరకు వచ్చిన ఉద్యమ ఫలితాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు ఆచరణలోకి వచ్చాయన్న అంశంపై చర్చించనున్నామని తెలిపారు. అనంతరం టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల సాధనకు ప్రతినిధులు సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ఈ అంశాలను రెండో దఫా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే సమావేశంలో దాసరి నారాయణ రావు, చిరంజీవి తదితర ముఖ్యనేతలతో చర్చించి తుది కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఉద్యమానికి పవన్ కల్యాణ్ మద్దతు కోరతామని చెప్పారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపిన వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం సరికాదని హితవు పలికారు. 11న జరిగే సమావేశానికి వచ్చే కాపు నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో బెదిరిస్తోందని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో కాపు నేతలు ఆకుల వీర్రాజు, రామినీడు మురళీ, నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 11న కాపు ఉద్యమ కార్యాచరణపై సమావేశం
Published Thu, Sep 8 2016 8:39 PM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM
Advertisement