వరంగల్‌కే అధిక ఫలాలు
► కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీరు
► మల్కాపూర్ రిజర్వాయర్‌కు మంత్రివర్గం ఆమోదం
► సంగెంలో టెక్స్‌టైల్ పార్క్
► త్వరలోనే శంకుస్థాపన చేస్తాం
► కురవి ఆలయం అభివృద్ధికి రూ.5 కోట్లు
► ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు
సాక్షి, మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫలాలు పూర్వపు వరంగల్ జిల్లాకే ఎక్కువగా చెందనున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. యావత్ ప్రజలు ఎన్నడూ ఊహించని వరంగల్ జిల్లాను చూడబోతున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మొక్కుల్లో భాగంగా రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ వీరభద్రస్వామికి శుక్రవారం బంగారు కోరమీసాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంచ్యాతండాలోని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు.
అనంతరం సీఎం కేసీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. కాళేశ్వరుడి ఆశీస్సులతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి లోయర్, మిడ్ మానేరు డ్యాంల ద్వారా 40 టీఎంసీల నీటిని రెండు పంటలకు సరిపడా అందిస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పట్టుబట్టారని, అది కూడా కేబినెట్‌లో అప్రూవల్ అయిందన్నారు.
దేశంలోనే నంబర్‌వన్ టెక్స్‌టైల్ పార్క్
వరంగల్ రూరల్ జిల్లాలోని సంగెం మండలంలో టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసి సూరత్, భీమండికి కూలీ కోసం వెళ్లినవారు అంత తిరిగొచ్చేలా దేశంలోనే పెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పరిశ్రమ దేశంలోనే నంబర్‌వన్ టెక్స్‌టైల్ హబ్‌గా మారబోతుందన్నారు. ఇప్పటికే టెక్స్‌టైల్ పార్క్‌కు భూసేకరణ పూర్తయిందని తెలిపారు. త్వరలో టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఇప్పటికే తిరుపూర్, సోలాపూర్‌కు ప్రత్యేక బృందాలు వెళ్లి టెక్స్‌టైల్ మీద అధ్యయనం చేశాయని గుర్తుచేశారు.
కురవి ఆలయం అభివృద్ధికి రూ.5 కోట్లు
డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తానని సీఎం ప్రకటించారు. కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున , మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున, 77 గ్రామాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, దేవాదాయ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ .శివశంకర్, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా, ఎంపీలు అజ్మీర సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్ నాయక్, కోరం కనుకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు కొండా మురళీధర్‌రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, గుడిమళ్ల రవికుమార్, వాసుదేవరెడ్డి, భరత్ కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
మూడు గంటలపాటు జిల్లాలో సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సుమారు మూడు గంటలపాటు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఉదయం 10.50 గంటలకు కురవికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో 11.15 గంటలకు కురవి శ్రీవీరభద్రస్వామి దేవాలయానికి చేరుకున్నారు. 11.32 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. 11.50 గంటలకు బస్సులో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇంటికి బయల్దేరి వెళ్లారు. 12.25 గంటలకు రెడ్యానాయక్ ఇంటికి చేరుకొని, భోజనం, ప్రెస్‌మీట్ తర్వాత 1.45 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.