స్పీడుగా పనిచేయాలి: కేసీఆర్ | kcr orders to officers in nizamabad tour | Sakshi
Sakshi News home page

స్పీడుగా పనిచేయాలి: కేసీఆర్

Published Sat, Apr 2 2016 2:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

స్పీడుగా పనిచేయాలి: కేసీఆర్ - Sakshi

స్పీడుగా పనిచేయాలి: కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలోని మూస పద్ధతులు వద్దు: అధికారులతో సీఎం కేసీఆర్
పజాప్రతినిధులు అధికారులపై అరవొద్దు
సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధి
వచ్చే ఆగస్టు నుంచి 9 గంటల ఉచిత విద్యుత్
నిజామాబాద్ జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
ఇందూరులో శ్రీ వేంకటేశ్వర కళ్యాణోత్సవానికి హాజరు
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలోని మూస పద్ధతులకు స్వస్తి పలకాలి. గత ప్రభుత్వాల్లో మాదిరి పనిచేస్తే కుదరదు. ఇప్పుడు స్పీడుగా పనిచేయాలి. ప్రజాప్రతినిధులు అధికారులపై ఎలా పడితే అలా మాట్లాడటం మానుకోవాలి. అధికారులు కూడా అహానికి పోకుండా హుందాగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల కలలను సాకారం చేద్దామని, బంగారు తెలంగాణను నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

బస్సుయాత్రలో భాగంగా రెండ్రోజుల పర్యటన కోసం శుక్రవారం సీఎం నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మాక్లూరులో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ్నుంచి నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయం చేరుకున్న సీఎం... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు. జిల్లాలో మిషన్ భగీరథ పథకాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

 

ప్రధాని సైతం మెచ్చుకున్నారు
సమీక్షలో సీఎం ప్రజాప్రతినిధులు, అధికారులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మార్గదర్శనం చేశారు. మిషన్ భగీరథపై నిర్లక్ష్యం తగదని, మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ , అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలన్నారు. ‘‘అంతా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రజాప్రతినిధులు రాజకీయాలను పక్కన బెట్టాలి. ప్రజల సమస్యల కోసం పాటుపడాలి. కొత్తగా ఏర్పడినా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఏ రాష్ట్రానికి తీసిపోలేదు. తెలంగాణను ప్రధాని, కేంద్రమంత్రులు సైతం ప్రశంసించారు’’ అని అన్నారు.

ఆగస్టు నుంచి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కరువు నివారణ కోసం రూ.32 కోట్లు కేటాయించామని, కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ దఫెదారు రాజు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.

మీడియాను అనుమతించని అధికారులు
సీఎం సమీక్ష కోసం మీడియాకు పరిమితంగా పాసులు మంజూరు చేసిన అధికారులు సమావేశానికి మాత్రం అనుమతించలేదు. దీంతో పాత్రికేయులు జెడ్పీ ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్ కింద మొబైల్ ఫోన్ల ద్వారా, టీవీలో వచ్చిన ప్రత్యక్ష ప్రసారాలను చూసి సీఎం సమీక్ష సమావేశ వివరాలు రాసుకోవాల్సి వచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement