ఖరీఫ్ సాగునీటి షెడ్యూల్ విడుదల
మూడు వారాలు ఆలస్యంగా నీటి విడుదలపై రైతుల అసంతృప్తి
జూన్‌లో వర్షాలు పడకపోతే ఇబ్బందులు తప్పవని ఆందోళన
అన్నదాతలకు ఖరీఫ్‌లోనూ సాగునీటి కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. రోనూ ప్రభావంతో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసినా ఏ ఒక్క జలాశయం లోను నాలుగైదు అంగుళాలకు మించి నీటి మట్టాలు పెరగలేదు. జూన్‌లో తొలకరి వర్షాలు కురవకపోతే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికి తోడు జిల్లా నీటిపారుదల శాఖ విడుదల చేసిన సాగునీటి విడుదల షెడ్యూల్ కూడా అన్నదాతలను కలవరపాటుకు గురిచేస్తోంది.
విశాఖపట్నం: జిల్లాలో సాగు విస్తీర్ణం 2,83,482 హెక్టార్లు కాగా, దాంట్లో సాగునీటి వనరుల కింద 1.13 లక్షల హెక్టార్ల సాగవుతుంటే వర్షాధారంపై 1.74లక్షల హెక్టార్లు సాగవుతోంది. ఇక ఖరీఫ్‌లో వాణిజ్యేతర పంటల విస్తీర్ణం 1,99,813 హెక్టార్లు కాగా, గతేడాది 2,08,988 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆచరణ కొచ్చేసరికి 1.75 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. కానీ ఈఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ 1.99 లక్షల హెక్టార్లలో సాగు చేయాలన్న పట్టుదలతో వ్యవ సాయశాఖ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
అధిక శాతం రిజర్వాయర్ల కిందే..
వరిసాగు అత్యధిక భాగం రిజర్వాయర్ల పరిధిలోనే ఉంది. తాండవ రిజర్వాయర్ కింద జిల్లా వరకు 32,689 ఎకరాలు, రైవాడ కింద 15,344, కోనాం కింద 12,638, పెద్దేరు కింద 19,322 ఎకరాలు వెరసి 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మిగిలిన కల్యాణపు లోవ, రావణాపల్లి, తారకరామ, శేషుగెడ్డ, గొర్రిగెడ్డ, పాలగెడ్డ తదితర చిన్నా చితకా రిజర్వాయర్ల కింద మరో 15 వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. మిగిలింది చెరువులు, గ్రోయిన్లు, చెక్‌డ్యామ్‌లు, ఇతర చిన్న నీటితరహా వనరుల కింద ఉంది.
రైతులతో సంప్రదించకుండానే..
ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు ఇన్‌ఫ్లోను బట్టి ఖరీఫ్ సీజన్‌లో నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ఆయా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారు. తొలిసారి ఈ ఏడాది రైతులతో సంప్రదించకుండా నీటి పారుదల శాఖాధికారులు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలకు రూపొందించిన షెడ్యూల్‌పై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగిలిన అన్ని జలాశయాల నుంచి జూలైలోనే నీటిని విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. జలాశయాల నుంచి నీరు విడుదల చేసిన తర్వాత జూలై రెండో వారం నుంచి చివరి వారం మధ్యలో కాల్వలకు నీటిని విడుదల చేసేవారు. నీటి విడుదల షెడ్యూల్‌ను బట్టి నారు మళ్లు పోసుకోవడం, నాట్లు వేయడం వంటి పనులన్నీ ఆగస్టు చివరి నాటికి పూర్తయ్యేవి. అక్టోబర్ చివరి వారం నుంచి పంట చేతికి రావడం మొదలవుతుంది. నాట్లు వేయడం ఏమాత్రం ఆలస్యమైనా నవంబర్‌లో విరుచుకుపడే ప్రకృతి విపత్తుల బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతుండే వారు. తాండవ నీటి విడుదల సమయాల్లో మార్పులేనప్పటికీ మిగిలిన రిజర్వాయర్ల పరిధిలోని ఆయకట్టుకు గతంలో కంటే చాలా ఆలస్యంగా నీటిని విడుదల చేసేలా షెడ్యూల్ రూపొందించారు. సకాలంలో వర్షాలుపడితే పర్వాలేదు. లేకపోతే మాత్రం రైతులకు సాగునీటి తిప్పలు తప్పవు.
ఆగస్టులో నీటి విడుదలా?
తాండవ నుంచి ఆగస్టు మొదటి వారంలో , రైవాడ, కోనాం నుంచి ఆగస్టు రెండో వారంలో, పెద్దేరు నుంచి ఆగస్టు చివరివారంలో, తాటిపూడి నుంచి జూలై నాలుగో వారంలో నీటిని విడుదల చేసేలా షెడ్యూల్ ప్రకటించారు. జూన్‌లో నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు కురిసి నేల గుల్లబారుతుందని, జూలైలో నీటిని విడుదల చేస్తే నారుమళ్లు పోసుకుంటుంటామని, అదేనెల చివరి నుంచి ఆగస్టు చివరి వరకు నాట్లు వేసుకుంటామని, ఇది ఆనవాయితీగా వస్తోందని రైతులంటున్నారు. కానీ ఆగస్టులో నీటిని విడుదల చేస్తే నారుమళ్లు ఎప్పుడు పోసుకోవాలి? నాట్లు ఎప్పుడు వేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అదును దాటితే పంట తెగుళ్ల బారినపడడంతో పాటు కోతకు వచ్చే సమయంలో తుఫాన్ల వల్ల పంటను కోల్పోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గిపోయాయని, ఇటీవల రోనూ ప్రభావంతో వర్షాలు కురిసినప్పటికీ క్యాచ్‌మెంట్ ఏరియాలో కురవకపోవడం వలన జలాశయాల్లో నీటిమట్టాలు కనీసం ఒక్క అడుగుకూడా పెరగలేదని అధికారులు చెబుతున్నారు. జూన్‌లో వర్షాలు పడకపోతే జూలైలో ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీటి షెడ్యుల్‌ను తయారు చేశామనిఐ రైతులు సహకరించాలని ఇరిగేషన్ ఎస్‌ఈ ఆర్. నాగేశ్వరరావు కోరారు.