వంట షెడ్ల నిర్మాణ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
Published Fri, Aug 5 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
ఏలూరు సిటీ : జిల్లాలో కిచెన్ షెడ్ల నిర్మాణం ఏడాది పడుతుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కలెక్టర్ భాస్కర్ విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలో వారం వారం విద్యాశాఖ ప్రగతి తీరుపై సమీక్ష నిర్వహిస్తున్నా పనితీరులో మార్పులేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో కట్టే కిచెన్ షెడ్లు నెలల తరబడి నిర్మించకపోవడం ఏమిటని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. 1043 కిచెన్ షెడ్లకు 856 పూర్తయ్యాయని, 107 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. వాటిలో 80 ఇంకా ప్రారంభించలేదని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి తప్పు మీదంటే.. మీదని కలెక్టర్ ఎదుటే వాదోపవాదాలకు దిగారు. దీంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరిలోనూ సమన్వయం లోపించిందని, చిన్న పిల్లల్లా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం, పంచాయితీ పెట్టుకోవడం చాలా శోచనీయమని కలెక్టర్ భాస్కర్ అన్నారు.
మరుగుదొడ్లు నూరు శాతం పూర్తి చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : అన్ని మునిసిపాలిటీలను అక్టోబరు 2న బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటిస్తానని, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్లు నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లతో వ్యక్తిగత మరుగుదొడ్లు, బయోమెట్రిక్ అటెండెన్స్, ఈ–ఆఫీస్, శానిటేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15వ తేదీలోగా అన్ని మునిసిపాలిటీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు టాయిలెట్ల నిర్మాణాలు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Advertisement
Advertisement