రైతుల పరిస్థితి దయనీయం | kishan reddy fire on cm kcr | Sakshi
Sakshi News home page

రైతుల పరిస్థితి దయనీయం

Published Wed, Apr 6 2016 4:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతుల పరిస్థితి దయనీయం - Sakshi

రైతుల పరిస్థితి దయనీయం

ఆదుకోకుంటే ఆత్మహత్యలు ఆగవు
మూగజీవాలను సాకేందుకు
బంగారం తాకట్టు పెడుతున్నారు
సాగుకు చేసిన అప్పులు పెరిగి
అవస్థలు పడుతున్నారు
‘సాక్షి’ కథనం చూసైనా ప్రభుత్వం మేల్కోవాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

యాచారం మండలంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసిన బీజేపీ బృందం
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేసినం. బోరుబావుల్లో నీళ్లులేక పంటంతా ఎండింది. సాగుకోసం చేసిన అప్పు మిగిలింది. వాటిని ఎలా తీర్చాలె సారూ.. కనీసం పశువులకు నీళ్లు, గడ్డి కూడా లేదు. మా కుటుంబం కోసం ఇన్నాళ్లు కష్టపడిన ఆ మూగజీవాల గోస చూడలేకపోతున్నం. చివరకు చేసేది లేక ఇంట్లో ఉన్న బంగారం కుదువ పెట్టి వాటి ఆకలి తీరుస్తున్నాం’. ఇదీ మంగళవారం బీజేపీ బృందం ఎదుట కన్నీటితో రైతులు విన్నవించుకున్న గోడు.

యాచారం: రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, కరువు కాలంలో ప్రభుత్వం వారిని ఆదుకోకుంటే ఆత్మహత్యలు ఆగే పరిస్థితి లేదని, ‘సాక్షి’ కథనం చూసైనా ప్రభుత్వం మేల్కోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పశుగ్రాసం కోసం పసిడి తాకట్టు’ వార్తకు స్పందించిన ఆయన ఆధ్వర్యంలోని బృందం మంగళవారం యాచారం మండలంలోని యాచారం, గాండ్లగూడెం, మల్కీజ్‌గూడ, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్ గ్రామాల్లో కరువు  పరిస్థితులపై అధ్యయనం చేసింది. మొదటగా యాచారంలోని ఎండిపోయిన అబ్బసామి చెరువును పరిశీలించారు. చెరువులో చేసిన మిషన్ కాకతీయ పనుల తీరు గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్కీజ్‌గూడలోపగుళ్లు పట్టిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 95 ఏళ్ల వృద్ధ రైతు కుమ్మరి సత్తయ్య బృందం సభ్యులకు తమ కష్టాలు వివరించారు.

ఇంతటి కరువు పరిస్థితులు ఎన్నడూ చూడలేదని, తన లాంటి రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం ఖాయమని రెండు చేతులు జోడించి కిషన్‌రెడ్డిని వేడుకున్నాడు. ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డితో పాటు పలువురు రైతులు కూడా తమ గోడును వెల్లబోసుకున్నారు. కరువు వల్ల బోరుబావుల్లో భూగర్భజలాలు తగ్గిపోయాయని, మూగజీవాలను కాపాడుకోవడానికి బంగార నగలు తాకట్టుపెట్టడం, వడ్డీలకు అప్పులు తెచ్చి పశుగ్రాసం, నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. అటు నుంచి కిషన్‌రెడ్డి బృందం నక్కర్తమేడిపల్లిలో ఎండిన కౌలు రైతు దోసు బుచ్చయ్యకు చెందిన వరిపంటను పరిశీలించారు. బుచ్చయ్య కిషన్‌రెడ్డికి సమస్యలు వివరించాడు. రెండున్నర ఎకరాల్లో రూ. 30 వేలు పెట్టుబడులు పెట్టి వరి సాగుచేస్తే నీళ్లులేక పంటంతా ఎండిదన్నారు. రూ. 60 వేలు అప్పు అయిందని బోరున విలపించాడు.

అనంతరం నానక్‌నగర్‌లోఎండిపోయిన వరి, కూరగాయల పంటలను పరిశీలించారు. అనంతరం నక్కర్తమేడిపల్లిలో రైతులు, ఉపాధి కూలీలతో బీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. రైతులు, కూలీలు, గొర్రెలు, మేకల కాపరులు కరువు కాలంలో తాము పడుతున్న ఇబ్బందులను కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కరువు కాలంలో రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నా రు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసి, ఉచి తంగా పశుగ్రాసం, నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.

ప్రజలు బతకడానికి గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కరువు పరిస్థితుల నేపథ్యంలో కూలీలను ఆదుకోవడం కోసం 100 రోజుల పనిదినాలను 150 రోజులకు పెంచిందన్నారు. పనులు చేసిన 24గంటల్లో కూలి డబ్బు లు ఇవ్వాలని నింబంధన ఉన్నా ప్రభుత్వం, అధికారులు దానిని పట్టించుకోకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతులు, కూలీ లకు న్యాయం జరిగేలా బీజేపీ కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి మంజూరైన నిధులను దారి మళ్లించి కూలీలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. భవిష్యత్తులో మోదీ ప్రభుత్వం రైతాంగం క్షేమం కోసం పలు రకాల బీమా పథకాలు అమలు చేయడానికి సంకల్పించిందని తెలిపారు.

విడతల వారీగా ప్రతి గ్రామానికి కేంద్రం రూ. 80లక్షలు మంజూరు చేయడానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ప్రతాప్, లచ్చిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొప్పు భాషా, కిన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు అంజయ్యయాదవ్, నాయకులు ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గౌర మల్లేష్, జగదీష్ యాదవ్, డేరంగుల రాజు, గోగికార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానికి ఫిర్యాదు చేస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమస్యలను పట్టించుకోకుంటే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. కరువు పరిస్థితులపై ‘సాక్షి’ ప్రచురించిన ‘పశుగ్రా సం కోసం పసిడి తాకట్టు’ కథనం రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్టుగా చూపిందన్నారు. ఈ కథనానికి స్పందించి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని బీజేపీ బృందం మంగళవారం యాచారం మండలంలో పర్యటిం చింది. కరువుబారిన పడిన రైతులతో మాట్లాడింది. ఎండిన పొలాలను పరిశీలించింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ‘సాక్షి’ కథనంలో ఉన్నట్టుగానే తమ జీవితం తాకట్టు మయమైందని ఆవేదన వ్యక్తంచేశారు.

కష్టకాలంలో తోడుగా ఉన్న పశువులను సంతలో అమ్ముకోలేక బంగారం తాక ట్టు పెట్టి వాటిని పోషించుకుంటున్నామని చెప్పారు. రైతాంగం కష్టాలను వెలుగులోకి తెచ్చిన ఈ కథనం ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉందని కిషన్‌రెడ్డి కితాబిచ్చారు. తెలంగాణలో కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి 10 బృందాలు పర్యటిస్తున్నాయని తెలిపారు. వారం, పదిరోజుల్లో  సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి, గవర్నర్‌లను కలుస్తామన్నారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లో మార్పు రాకుంటే ప్రధానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

కరువు సహాయక చర్యల కోసం కేంద్రం తక్షణమే రూ. 800 కోట్లు మంజూరు చేసిందని, అయి తే, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కలిపి రైతాంగా న్ని, కూలీలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి కూలీలకు సకాలంలో కూలి చెల్లించకుంటే సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యల కోసం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఓట్లు, సీట్ల మీద ఉన్న ధ్యాస రైతాంగం, ప్రజా సమస్యలపై లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement