స్నేహితురాలికి కిట్స్ విద్యార్థుల అండ
Published Sat, Sep 17 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
భీమారం : భీమారంలోని కిట్స్ కళాశాల విద్యార్థులు తమ స్నేహితురాలికి అండగా నిలబడడం ద్వారా స్నేహబంధాన్ని చాటిచెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో బీటెక్ చదువుతున్న దివ్య సోదరుడు రమేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు.
శస్త్రచికిత్స కోసం పెద్ద మొత్తంలో నగదు అవసరమని వైద్యులు చెప్పగా.. నిరుపేదలైన రమేష్ కుటుంబానికి ఆ మొత్తం భరించే స్థోమత లేకపోయింది. ఈ మేరకు విషయాన్ని దివ్య తన సోదరుడి పరిస్థితి, తమ కుటుంబ ఇబ్బందులను స్నేహితులకు వివరించింది. దీంతో కళాశాల స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్-హ్యుమానిటీ క్లబ్ ఆధ్వర్యాన విద్యార్థులు వివిధ వర్గాల నుంచి సుమారు రూ.లక్ష విరాళాలు సేకరించారు. ఈ నగదును రమేష్ శస్త్రచికిత్స కోసం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మనోహర్ చేతుల మీదుగా దివ్యకు శుక్రవారం అందజేశారు. దీంతో దివ్య స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, హ్యుమానిటీస్ క్లబ్ ఇన్‌చార్జీ రమేష్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement