బ్యాంకుల మెడకు ఆర్‌బీఐ ఉచ్చు
Published Tue, Jan 3 2017 2:25 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
తణుకు : బ్యాంకు అధికారుల మెడకు ఆర్‌బీఐ ఉచ్చు బిగుసుకుంటోంది. తణుకు ఎస్‌బీఐ కేంద్రంగా సాగిన అక్రమ లావాదేవీలు ఇటీవల వెలుగు చూడగా.. కీలక బాధ్యుడిగా భావించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై వేటు వేసిన ఆర్‌బీఐ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. సోమవారం తణుకు పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 5 బృందాలుగా విడిపోయి సోమవారం వేకువజామునుంచి సోదాలు చేపట్టారు. కొందరు బ్యాంకు మేనేజర్లు ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఒక బ్యాంక్ మేనేజర్ నివాసంలో అధికారులు గంటల కొద్దీ సోదాలు నిర్వహించి వారినుంచి వాంగ్మూలం సేకరించారు. బొమ్మల వీధిలో నివాసం ఉంటున్న మరో బ్యాంకు మేనేజర్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆయనను తమతో తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. తణుకు ఎస్‌బీఐ శాఖలోని కొందరు సిబ్బందిని సైతం సోమవారం పొద్దుపోయేవరకు విచారించినట్టు తెలుస్తోంది. సోదాలకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
Advertisement
Advertisement