జీడిపల్లికి చేరిన కృష్ణమ్మ
పుష్కర స్నానానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నేటి ఉదయం ఏడు గంటలకు విగ్రహ ప్రతిష్ట, పూజలు
అత్యవసరమైతే...
ఏదైనా సమస్య తలెత్తితే అత్యవసర సహాయం కోసం బెళుగుప్ప తహశీల్దారు చలపతి తన సిబ్బందితో అందుబాటులో ఉంటారు. ఆయన సెల్ నంబర్ 9493188847.
ఇలా చేరుకోవాలి..
ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలంలో జీడిపల్లి జలాశయం ఉంది. అనంతపురం– కళ్యాణదుర్గం మార్గంలో ఆత్మకూరు దాటిన తరువాత కాల్వపల్లి వస్తుంది. అక్కడి నుంచి ఆటోల్లో జీడిపల్లి జలాశయం చేరుకోవచ్చు. అనంతపురం– కళ్యాణదుర్గం మధ్య ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది.
అనంతపురం అర్బన్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జీడిపల్లి జలాశయంలో గురువారం అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 23న ముగుస్తాయి. ఈ తరుణంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి జలాశయం వద్ద పుష్కర స్నానాలు చేసేందుకు అధికారులు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కృష్ణమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి.. పూజలు నిర్వహిస్తారు. అనంతరం పుష్కరాలను ప్రారంభిస్తారు. పుష్కర పూజలు చేసేందుకు నలుగురు పురోహితులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తుల రద్దీని బట్టి మరో ఘాట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం షామియానా వేసి 200 కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. లైటింగ్ కూడా ఉంటుంది. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినా చికిత్స అందించేందుకు వైద్యులు, సిబ్బంది, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుతున్నారు.
రక్షణ కోసం ఘాట్ వద్ద పది మంది గత ఈతగాళ్లను ఉంచుతున్నారు. పుష్కర స్నానాలు ఆచరించిన తరువాత మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. పెద్దలకు పిండ ప్రదానం చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేక బస్సులు నడిపితే మేలు
జీడిపల్లి జలాశయం వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపితే భక్తులకు అనుకూలంగా ఉంటుంది. భక్తులు పూజా సామగ్రితో వెళతారు. ఈ క్రమంలో కాల్వపల్లి వద్ద దిగి ఆటోలో జలాశయానికి చేరుకోవడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రత్యేక సర్వీసులు నడిపితే వారు నేరుగా జలాశయం వద్దకు చేరుకుంటారు.