దారి దోపిడీ!
► ఇదీ.. తమ్ముడి లెక్క
► కర్నూలు - దేవనకొండ రోడ్డుకు మళ్లీ బ్రేకులు
► ట్రాక్టర్ ఇసుకకు అదనంగా రూ.400 చెల్లించాలని ఓ టీడీపీ నేత డిమాండ్
► రంగంలోకి దిగిన మాజీ మంత్రి
► తట్టుకోలేక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్?
► నవంబర్ నాటికి పనులు పూర్తయ్యేది కష్టమే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు-దేవనకొండ రోడ్డు మార్గానికి మళ్లీ బ్రేక్ పడింది. ఈసారి అధికార పార్టీ నేతల ఇసుక దందా అడ్డంకిగా మారింది. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రకటించినప్పటికీ.. తమకు మాత్రం ట్రాక్టర్‌కు రూ.400 చెల్లించాల్సిందేనని కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు డిమాండ్ చేయడమే పనులు నిలిచిపోయేందుకు కారణమైనట్లు తెలిసింది. ట్రాక్టర్ ఇసుకకు రూ.400 ఇవ్వకుంటే పనులు చేసుకోవద్దంటూ ఆ నేత కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు చర్చ జరుగుతోంది.
జిల్లా ముఖ్య నేత సోదరుడు, మాజీ మంత్రి ఒకరు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాజకీయ నేతల మామూళ్ల కక్కుర్తికి రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి అనుచరుడి బెదిరింపులతో గత కొద్దిరోజులుగా కోడుమూరు దాటిన తర్వాత రోడ్డు పనులు కాస్తా పూర్తిగా నిలిచిపోయాయి.
సీన్‌లోకి మాజీ మంత్రి..
రాష్ర్టంలో 45 రోజుల క్రితం ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించింది. దీంతో రోడ్డు పనులకు ఇక ఇబ్బంది లేదనుకున్న సదరు కాంట్రాక్టర్‌కు అనుకోని రీతిలో అడ్డంకులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఉచితంగా ప్రకటించినప్పటికీ తనకు మాత్రం వాటా కావాల్సిందేనని కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ముఖ్య నేత సోదరుడు, మాజీ మంత్రి రంగంలోకి దిగారు. తన మనిషి అడిగిన మొత్తం ఇస్తేనే పనులు జరగనిస్తానని సదరు నేత కూడా స్పష్టం చేశారు. ఇక చేసేది లేక కాంట్రాక్టర్ కాస్తా చేతులెత్తేశారు.
ఆది నుంచీ అదే తీరు.. వాస్తవానికి ఈ రోడ్డు నిర్మాణ పనులకు రూ.102.01 కోట్లు విడుదల చేస్తూ జూలై 24, 2009న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పనులను రెండు సంవత్సరాల్లోగా పూర్తి చేయాలని ప్రాజెక్టు గడువును నిర్దేశించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో పాటు.. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, అనేక మంది ఎమ్మెల్యేలు పనులు చేసేందుకు తమకు మామూళ్లు ఇవ్వాలంటూ ఒత్తిళ్తు తీసుకొచ్చారు. దీంతో తాను పనులు చేయలేనంటూ కాంట్రాక్టర్ కాస్తా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)ను కూడా వదిలివేసుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే, దీనిని సరిదిద్ది పనులు చేయించేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫలితంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
తీరా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనుల విలువను రూ.102.01 కోట్ల నుంచి ఏకంగా రూ.135 కోట్లకు పెంచుతూ 2014 నవంబర్ 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా 24 నెలల్లో(2016 నవంబరు 12వ తేదీ నాటికి) రోడ్డు పనులను పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మళ్లీ పనులు ప్రారంభమైన వెంటనే అధికార పార్టీ మంత్రి, జిల్లా ముఖ్యనేత కాస్తా వాటా అడగడంతో పనులకు బ్రేక్ పడింది. ఈ వ్యవహారం కాస్తా సద్దుమణిగి పనులు మళ్లీ ప్రారంభమై.. రెండు, మూడు నెలల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. అయితే, ఇప్పుడు అధికార పార్టీ నేతల ఇసుక దందాతో రోడ్డు పనులకు బ్రేక్ పడటం గమనార్హం.