
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
► కూలి కోసం వెళ్లి కాల్పులకు గురయ్యాడంటున్న కుటుంబసభ్యులు
► పోలీసు రికార్డుల్లో పేరు లేదంటున్న చింతూరు సీఐ
బుర్కనకోట (చింతూరు): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంటలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్ ఉదంతం వివాదంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన సోయం మనోహర్(26) అనే మావోయిస్టు ఛత్తీస్‌గఢ్‌లోని కుంటలో భెర్జి బేస్ క్యాంపు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లుగా కుంట పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. మనోహర్‌కు మావోయిస్టులతో సంబంధాలు లేవని వ్యవసాయంతోపాటు తాపీపని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. మనోహర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం బుధవారం బుర్కనకోటకు తరలించారు.
తాపీపని కోసమంటూ వెళ్లాడు...
తన భర్త మూడ్రోజుల క్రితం తాపీ పని నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు మృతుడి భార్య తిరపతమ్మ విలేకరులకు తెలిపింది. బుర్కనకోటలో ఉంటూ తన భర్త వ్యవసాయంతోపాటు తాపీ పని చేసుకుంటున్నాడని ఆమె తెలిపింది. కాగా మావోయిస్టులతో కలసి కుంటలో దాడికి రాగా తాము జరిపిన కాల్పుల్లో మనోహర్ మృతిచెందాడని, అతని వద్ద తుపాకీ కూడా లభ్యమైందని పోలీసులు చెబుతుండగా.. అదంతా కట్టుకథని, తమకు న్యాయం చేయూలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసు రికార్డుల్లో పేరులేదు..
మనోహర్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు పోలీసు రికార్డుల్లో లేదని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఎన్‌కౌంటర్ వార్త అనంతరం అతను బుర్కనకోటకు చెందిన వ్యక్తిగా తేలిందన్నారు. అతనికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలున్నాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.