తల్లి కాబోతున్న వేళ తల్లడిల్లిన అమ్మ
-
పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన గర్భిణి
-
పట్టించుకోని వైద్యులు బెడ్ మీదనే ప్రసవ వేదన
-
పురుడు పోసిన పారిశుద్ధ్య కార్మికురాలు
-
ఇన్‌చార్జి ఆర్‌ఎంవోను నిలదీసిన వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి
సాక్షి, రాజమహేంద్రవరం: తల్లి కాబోతున్న ఆనందంలో పురిటి నొప్పులను పంటి బిగువన అదిమిపట్టిన ఆ గర్భిణి ప్రభుత్వాస్పత్రిలోనే నరకం చవి చూసింది. నొప్పులతో అల్లాడుతూ బెడ్‌పైనే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దాదాపు పది గంటలపాటు ప్రసవ వేదనతో అల్లాడిపోయింది. తమ బిడ్డపై దయచూపాలని ఆస్పత్రి స్టాఫ్‌నర్సులను బంధువులు బతిమలాడినా కనికరం చూపించ లేదు. రాత్రంతా పురిటి నొప్పులతో అల్లాడిన ఆ గర్భిణి ఉదయం ఏడు గంట లకు బెడ్ మీదనే ప్రాణాపాయ స్థితిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు పురుడుపోసింది. ప్రభుత్వ వైద్యులు, స్టాఫ్‌నర్స్‌ల నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ ఘటన రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. డాక్టర్లు, స్టాఫ్‌నర్స్‌ల నిర్లక్ష్యంపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బంధువుల కథనం మేరకు.. స్థానిక 49వ డివిజన్ సుబ్బారావుపేటకు చెందిన గాతల ప్రమీలాదేవీ ప్రసవం కోసం 4 రోజుల క్రితం ప్రభుత్వాస్పత్రిలో చేరింది. వైద్యులు పలు పరీక్షలు రాశారు. అయితే మెడ్ ఆల్ సిబ్బంది పేపర్‌పై ఒకవైపు ఉన్న పరీక్షలే చేశారు. డాక్టర్ నాయక్ చూసి మిగిలిన పరీక్షలు చేయలేదంటూ సిబ్బందిపై మండిపడి మిగిలి నవి కూడా చేయించాలని బంధువులకు సూచించారు. గురువారం సిబ్బంది లేరని చెప్పడంతో శుక్రవారం వస్తే 12 గంటలకే పరీక్షలు చేసే సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 10.30 గంటలకు ప్రమీలాదేవికి నొప్పులు ప్రారంభమయ్యాయి. నర్సులను పిలిచినా వారు పట్టించుకోలేదు. అర్థరాత్రి 2 గంటలకు ప్రసవం కోసం ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఉదయం 7.30 గంటల వర కూ ఆ తల్లి పురిటినొప్పుల అరుపులతో ఆస్పత్రి గది ప్రతిధ్వనించింది. అయినా నర్సులు, వైద్యులు పట్టించుకోలేదు. ఉదయం 7 గంటలకు బెడ్ పైనే ప్రసవం ప్రారంభమైంది. బిడ్డ తల బయటకు రావడంతో బంధువులకు ఏం చేయాలో తెలియలేదు. పరుగున వెళ్లి నర్సులకు చెప్పారు. అయినా వారు పెడచెవిన పెట్టారు. దాదాపు అరగంటపాటు ఆ తల్లి నరకయాతన అనుభవించింది. తన బిడ్డకు ఏమవుతుందోనని ప్రమీలాదేవి భీతిల్లింది. ఆమె బాధ చూసిన ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు వెంటనే తన పని ఆపి పరుగున వచ్చింది. తలభాగం బయటకు వచ్చిన బిడ్డను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అరగంటపాటు ఆ తల్లికి పురుడు పోయాలని తపనపడింది. తీవ్ర రక్త స్రావం జరుగుతున్నా ఏం చేయాలో తెలి యలేదు. ఆ బిడ్డకు ప్రాణం పోసి ఓ తల్లికి కడుపుకోత లేకుండా చేయాలన్న ఆ కార్మికురాలి పట్టుదల ఎట్టకేలకు ఫలించింది. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. తీవ్ర రక్త స్రావం జరగడంతో ప్రమీలాదేవి సొమ్మసిల్లి పడిపోయింది.
ఆర్‌ఎంవోను నిలదీసినవైఎస్సార్‌సీపీ నేతలు
గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్థిని, స్టాఫ్‌నర్స్‌ల నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఇ¯ŒSచార్జి ఆర్‌ఎంవో లక్ష్మీపతి వద్ద మండిపడ్డారు. డాక్టర్ విష్ణువర్థిని ఎప్పుడూ గర్భిణుల పట్ల హేళనగా మాట్లాడడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు ఆస్పత్రిలో ప్రమీలాదేవికి జరిగిన అన్యాయాన్ని ఆమె బంధువులు 49వ డివిజ¯ŒS వైఎస్సార్ సీపీ ఇ¯ŒSచార్జి ఆకుల విజయభారతి, కార్పొరేషన్‌లో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావుల దృష్టికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న వారు పరీక్షల విభాగం సిబ్బందిని నిలదీశారు. ఇన్ చార్జి ఆర్‌ఎంవో గదికి వచ్చి జక్కంపూడి విజయలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కార్పొరేటర్ బొంతా శ్రీహరి, ఇతర అనుచరులతో ఆస్పత్రికి చేరుకున్న జక్కంపూడి విజయలక్ష్మి బాధితులకు జరిగిన అన్యాయంపై మండిపడ్డారు. సిబ్బంది కొరత వల్ల ఇలాంటి ఘటనలు సాధారణమేనని లక్ష్మీపతి సమర్థించుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ విష్ణువర్థిని, స్టాఫ్‌నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడినుంచే ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిశోర్‌తో ఫో¯ŒSలో మాట్లాడారు. వారిపై సోమవారంలోగా చర్యలు తీసుకోకుంటే ఆస్పత్రి వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం తల్లీ, బిడ్డలను పరామర్శించారు.