అభివృద్ధికి అడ్డంగా రాజకీయం
నిర్మాణానికి మోకాలడ్డు
ఆక్రమణదారులకు సహకారం
సాక్షి, రాజమహేంద్రవరం:నిధులకు లోటు లేదు. అయినా అభివృద్ధి పనులు జరగవు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు పుష్కలంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో పనులు మందకొడిగా సాగుతున్నాయి. రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలు ఇందుకు అవరోధంగా నిలుస్తున్నాయి. వీటి తొలగింపునకు అధికారులు యత్నిస్తున్నప్పటికీ ప్రజాప్ర తినిధులు, రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో సకాలంలో పనులు పూర్తి చేయకపోతే బిల్లులు ఆగిపోతాయని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో కొన్నిచోట్ల డ్రైనేజీల విస్తరణ, మరికొన్ని చోట్ల నూతన డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. నగరంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైన్ల విస్తరణ జరగకపోవడంతో పలు సందర్భాల్లో రోడ్లు మురుగునీటి ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి ముగిసేలోపు వీలైనంత మేరకు డ్రైనేజీల విస్తరణ, నూతన నిర్మాణాలు చేపట్టాలని నగరపాలక యంత్రాంగం నిర్ణయించింది.
మూడేళ్ల తర్వాత మోక్షం కలిగినా...
నగరంలోని తొమ్మిదో డివిజన్‌లో వాకర్స్ పార్కు సమీపంలోని జాతీయ వైద్య మండలి (ఐఎంఏ) కార్యాలయం రోడ్డులో నూతనంగా డ్రైనేజీ నిర్మిస్తున్నారు. గత పుష్కరాల సమయంలోనే ఇక్కడ డ్రైనేజీల నిర్మాణానికి రూ.25 లక్షల 13వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించినప్పటికీ ఐఎంఏ కార్యాలయ ప్రహరీ గోడ రెండడుగుల మేర, మరో ఇంటి ప్రహరీ నుంచి మూడు అడుగుల మేర రహదారిపైకి రావడంతో వాటిని తొలగించాల్సి వచ్చి అప్పట్లో ఆ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మార్చితో నిధులు మురిగిపోనున్న నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. దీంతో నిర్మాణ వ్యయం రూ.43 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం ఐఎంఏ కార్యాలయ ప్రహరీ తొలగింపు విషయాన్ని ఆ కార్యవర్గం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు వివరించగా ఆయన ఏకంగా కాలువ అలైన్‌మెంట్ మార్చాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదే శాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో మూడు రోజులుగా అక్కడి పనులు నిలిపివేశారు. ఇప్పటికే దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయని, మార్చి 10వ తేదీకి మిగిలిన పని పూర్తి చేయకపోతే బిల్లులు ఆగిపోతాయని కాంట్రాక్టర్లు ఆందోళన చెంతుతున్నారు.