అనర్హులకు పింఛన్లు ఇస్తారా?
అనర్హులకు పింఛన్లు ఇస్తారా?
Published Thu, Feb 9 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
మేయర్‌ను నిలదీసిన ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్లు
పూర్తిస్థాయి విచారణ చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల ఆదేశం
రూరల్ డివిజన్లకు సిటీ పింఛన్లు ఎలా ఇస్తారన్న నండూరి రమణ
సాక్షి, రాజమహేంద్రవరం : అనర్హులకు పింఛన్లు కేటాయిస్తున్నారని, ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్ల డివిజన్లలో జన్మభూమి కమిటీలకు పింఛన్లు కేటాయించారన్న అంశంపై రాజమహేంద్రవరం నగరపాలక మండలి సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ ఎం.షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు పి.నిర్మల, ఇ.బాపన సుధారాణిలతో పాటు స్వతంత్ర కార్పొరేటర్లు మేయర్‌ను నిలదీశారు. బుధవారం ఉదయం10.30 గంటలకు కౌన్సిల్ సమావేశం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన ప్రారంభమైంది. అంతకు ముందు పింఛన్ల కేటాయింపుల్లో తమ వార్డులకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ ఉదయం 10 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, ప్రతిపక్ష కార్పొరేటర్లు పింఛ¯ŒS దరఖాస్తుదారులతో ధర్నా చేశారు. మేయర్ పక్షపాత వైఖరిని నిరసిస్తూ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. మూడో పట్టణ సీఐ రామకోటేశ్వరరావు తన సిబ్బందితో రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, విప్ మింది నాగేంద్ర, కార్పొరేటర్ బొంతా శ్రీహరి తదితరులను అరెస్ట్ చేసి స్టేష¯న్‌కు తరలించారు. కాగా, 11 గంటల సమయంలో కౌన్సిల్ సమావేశానికి వైఎస్సార్ సీపీ మహిళా కార్పొరేటర్లు హాజరయ్యారు. పింఛన్ల కేటాయింపుల్లో వివక్ష, తమ పార్టీ కార్పొరేటర్లను అరెస్ట్ చేయడంపై ఎం.షర్మిళారెడ్డి, పి.నిర్మల, ఇ.బాపన సుధారాణి కౌన్సిల్‌ను స్తంభింపజేసి తమ పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. వారిని బయటకు పంపేయాలని టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌ను డిమాండ్ చేయడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో మార్షల్స్(మహిళా సిబ్బంది) వారిని బయటకు తీసుకెళ్లారు. స్వతంత్ర కార్పొరేటర్లు, బీఎస్పీ కార్పొరేటర్ బర్రే అనుహెలెనియా కూడా ఇదే విషయంపై మేయర్ పోడియం ముందు మౌనదీక్షకు దిగి నిరసన వ్యక్తం చేయడంతో గోరంట్ల రెండున్నరేళ్లలో నగరపాలక సంస్థ పరిధిలో ఇచ్చిన 3600 పింఛన్లపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సారి వచ్చే పింఛన్ల కేటాయింపులో పేదలు ఎక్కువగా ఉన్న డివిజన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గ పరిధి అధారంగా కేటాయించిన పింఛన్లను రూరల్ నియోజకవర్గంలోని 8 డివిజన్లకు కూడా ఎలా పంపిణీ చేస్తారని స్వతంత్ర కార్పొరేటర్ నండూరి వెంకటరమణ ప్రశ్నించారు. గతంలోలాగే తన నియోజకవర్గంలోని 8 డివిజన్లకు ఈ సారి 340 పింఛన్లు కేటాయించారని ఎమ్మెల్యే గోరంట్ల సమాధానమిచ్చారు. దీంతో స్వతంత్ర కార్పొరేటర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా...?
ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన వారిని అరెస్టు చేస్తారా? వారిలో ఉన్న కార్పొరేటర్లను విడిచిపెట్టమని చెప్పండి, వారు సభకు వస్తే నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశం ఉంటుందని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. వారిని సభకు అనుమతిస్తే పింఛన్లపై చర్చించవచ్చని అనడంతో గోరంట్ల కల్పించుకుని హు ఆర్ యు? నా కారునే అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడ్డుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పడంతో అధికారపార్టీ కౌన్సిలర్లు తమ ఎమ్మెల్యేపైనే విమర్శలు చేస్తారా అంటూ ఎదురుదాడికి దిగారు. ఈ తరుణంలో పింఛన్లపై సమాధానం చెప్పాలంటూ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకువెళ్లి పింఛన్లపై అవకతవ కలపై సమాధానం చెప్పాలని మేయర్‌ను నిలదీశారు. చైర్‌లో కూర్చుంటే సరిపోదని, రూల్ చేయాలని షర్మిల హితవుపలికారు. ఇంతలో గోరంట్ల జోక్యం చేసుకుని వైఎస్ హయాంలో కేంద్రం రూ.400 ఇస్తే ఆయన మాత్రం రూ.200లు ఇచ్చారనడంతో షర్మిలారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం పింఛన్లు మంజూరు చేశారా చెప్పండని ప్రశ్నించారు. ఇంతలో టీడీపీ కార్పొరేటర్‌లు వాసిరెడ్డి తదితరులు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, అంతా తమకు నచ్చినట్టే పనులు చేసుకుంటామని బిగ్గరగా అరవడం, ఇందుకు ప్రతిగా వైఎస్‌ఆర్‌సీపీ, స్వతంత్ర కార్పొరేటర్‌లు వాదనకు దిగడంతో వారి మైక్‌ఇవ్వకుండా, మార్షల్స్‌తో ప్రతిపక్ష కార్పొరేటర్‌లను బయటకు పంపించేశారు.
అంతా మాఇష్టం ...
తాడితోట (రాజమహేంద్రవరం) : నగర పాలకసంస్థ కౌన్సిల్ సమావేశం అధికార పార్టీ ఇష్టారాజ్యంగా సాగింది. ప్రతిపక్ష పార్టీలకు కనీసం సమస్యలు ప్రస్తావించే అవకాశం కూడా ఇవ్వకుండా వ్యవహరించారు. పింఛన్లలో వివక్ష ప్రదర్శించారని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి, విప్ ఈతకోటి బాపన సుధారాణి, తదితరులు పోడియం వద్దకు వెళ్లి మేయర్‌ను నిలదీయడంతో అధికార పక్ష నేతలు మార్షల్స్‌తో వారిని బయటకు తరలించారు.
బీఎస్పీ కార్పొరేటర్ మౌన నిరసన
స్ధానిక 49వ డివిజన్ కార్పొరేటర్ (బీఎస్పీ) బర్రే అనుహెలీనియా పింఛన్ల కేటాయింపుపై వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశానికి నీలిరంగు వస్త్రం నోటికి చుట్టుకుని వచ్చి మేయర్ పొడియం వద్ద బైఠాయించి పింఛన్ల కేటాయింపులో తమ వార్డుకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. క్వారీ గోతుల్లో పడి పసిపిల్లలు మృతి చెందుతున్నా వాటిని పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. ఎస్సీ కాంపోనెంట్ నిధులు ఎస్సీలు నివసించే ప్రాంతాల అభివృద్ధికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మేయర్ వినియోగిస్తున్న కారు అద్దె రూ.40 వేలు కలిపి నెలకు రూ.70 వేలు వరకూ ఖర్చు అవుతోందంటూ ప్రజల సొమ్ము దుబారాపై మౌన నిరసన తెలిపారు.
Advertisement
Advertisement