చిరుత దాడిలో దూడ మృతి
దేవాలయ గుర్రంపైనా
దాడిచేసి గాయపరచిన వైనం
వజ్రకరూరు : గూళ్యపాళ్యంలో చిరుత సంచారం మళ్లీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కేశప్పకు చెందిన దూడను చిరుత చంపేసింది. శనివారం రాత్రి కూడా లాలుస్వామి దేవాలయానికి చెందిన గుర్రంపై చిరుత దాడిచేసి గాయపరచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏ సమయంలో చిరుత గ్రామంలోకి ప్రవేశిస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
పది రోజుల క్రితం కూడా చిరుత గ్రామ సమీపంలో ఉన్న కొండపై కూర్చుని అటు ఇటు తిరిగిన దృశ్యాలను గుర్తించారు. ఇప్పుడు మరోసారి దూడను చంపడం, గుర్రంపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డిలు అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీఎఫ్‌ఓ చంద్రశేఖర్, గుత్తి ఫారెస్టు రేంజర్ డేవిడ్ తదితరులకు చిరుత సంచారం గురించి వివరించారు.
గ్రామస్తులకు భరోసా కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సూచనలతో అసిస్టెంట్ ఫారెస్టు బీట్ అధికారి నాగ్యనాయక్, వెటర్నరీ అసిస్టెంట్ భద్రు నాయక్, వైల్డ్ ఫీల్డ్ వాచర్ రాజశేఖర్ నాయక్ గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు.
మళ్లీ చిరుత కలకలం
Published Sun, Oct 9 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement