లిఫ్టులో చిక్కుకుపోయిన అల్లు అర్జున్
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించేందుకు వచ్చిన సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను కాసేపు లిఫ్టులో చిక్కుకుపోయారు. సరైనోడు సినిమా విజయవంతం కావడంతో శుక్రవారం సింహాచలం వచ్చిన అల్లు అర్జున్, బోయపాటి శ్రీను స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు అల్లు అర్జున్‌ని చుట్టుముట్టారు.
దర్శనానంతరం ఆలయంలోంచి బయటకి వచ్చేటప్పుడు రాజగోపురం వద్ద ఉన్న లిఫ్టులో అల్లు అర్జున్, బోయపాటి పది నిమిషాలపాటు చిక్కుకుపోయారు. వారితోపాటు పరిమితికి మించి జనం ఎక్కడంతో లిఫ్టు ఆగిపోయి, తలుపులు తెరచుకోక కలకలం రేగింది. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్టు తలుపులు వంచి అల్లు అర్జున్‌ని పంపించారు. లిఫ్టు మరమ్మతులకు అయ్యే ఖర్చుని తాము భరిస్తామని వారి వెంట వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ సత్యనారాయణ దేవస్థానం అధికారులకు తెలియజేశారు.