
ఎమ్మెల్యే భూమి పూజ.. స్థానికుల ఆందోళన
హైదరాబాద్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 1 వెంగల్‌రావు పార్కు వెనుకాల దోబీఘాట్ బస్తీలో వ్యాయామశాల నిర్మాణానికి మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. అయితే ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పనులను తక్షణం నిలిపివేయాలంటూ స్థానికులంతా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వారందరినీ శాంతింపజేసి ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల ప్రయోజనాలను తెలియజేశారు.
పార్కు పక్కన ఉన్న పార్కింగ్ స్థలం నుంచి వ్యాయామశాలకు రోడ్డు నిర్మిస్తామని దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల దళిత యువకులకు ప్రయోజనం ఉంటుందన్నారు. సుఖ్‌దేవ్‌నగర్, రామకష్ణానగర్, బాలాపురబస్తీ, గాందీపుర బస్తీ, దేవరకొండ బస్తీ, ఇలా అన్ని ప్రాంతాల యువకులు వినియోగించుకోవడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కిషన్, అభిలాష్, రవి, శివ, ప్రవీన్, వీరాస్వామి, చంద్రశేఖర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.